పొత్తుల సంకేతాలు.. జ‌నం మైండ్ మార్చేస్తున్నాయా…!

రాష్ట్రంలో అన్ని పార్టీల నుంచి ఒకే మాట వినిపిస్తోంది. అదే.. పొత్తులు.. బాబూ.. పొత్తులు.. అనే మాట‌. ఎ వరు ఎవ‌రితో జ‌త క‌డ‌తారు.. అనే మాట ప‌క్క‌న పెడితే.. అస‌లు ఎన్నిక‌ల‌కు రెండేళ్ల ముందే.. ఈ పొత్తుల విష‌యం చ‌ర్చ‌కు రావ‌డం.. ప్ర‌జ‌ల్లో ఎలాంటి సంకేతాల‌ను పంపిస్తుంద‌నేది చ‌ర్చ‌కు దారితీస్తోంది. అస‌లు ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారు? పార్టీలు ఎందుకు పొత్తు పెట్టుకోవాల‌ని భావిస్తున్న‌ట్టు ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు? అనే విష‌యాలు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.

2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ-బీజేపీ-జన‌సేన‌(పొటీ చేయ‌లేదు) పొత్తు పెట్టుకుని ఎన్నిక‌లకు వెళ్లా యి. అప్ప‌ట్లో ఒక రీజ‌న్ ఉంది. విడిపోయిన రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా రావాల‌న్నా.. నిధులు రావాల‌న్నా.. ఆర్థిక లోటు భ‌ర్తీ కావాల‌న్నా.. కేంద్రంలోనూ.. రాష్ట్రంలోనూ స‌మ‌స్య‌లు లేని స‌ర్కారు రావాల్సి ఉంద‌ని.. అప్ప‌ట్లో ఈ పార్టీలు ప్ర‌క‌టించారు. అటు మోడీ నుంచి ఇటు ప‌వ‌న్ వ‌ర‌కు.. చంద్ర‌బాబు నుంచి బీజేపీ నేత‌ల వ‌రకు అంద‌రూ.. ఈ విష‌యంలో ప్ర‌జ‌ల‌ను ఒప్పించారు. ప్ర‌జ‌ల ఆలోచ‌న‌ల‌ను మార్చ‌గ‌లిగారు.

దీంతో వీరు చెప్పిన విష‌యాల‌పై దృష్టి పెట్టిన ప్ర‌జ‌లు.. నిజ‌మే క‌దా.. అనుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆ మూడు పార్టీల పొత్తును స్వాగ‌తించారు. అయిన‌ప్ప‌టికీ.. 2014 ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేసిన వైసీపీకి 67 స్థానాలు ఇచ్చి గెలిపించారు. ఆ త‌ర్వాత‌.. ఏం జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే. హోదా రాలేదు. నిధులు కూడా రాలేదు. కేంద్రం స‌హ‌కారం కూడా రాలేదు. పాచిపోయిన ల‌డ్డూ అంటూ.. ప్యాకేజీని.. ప‌వ‌న్ ఎద్దేవా కూడా చేశారు. క‌ట్ చేస్తే.. ఇదే కోపం కావొచ్చు.. లేదా రాజ‌కీయ వ్యూహం కావొచ్చు.. 2019లో ఎవ‌రికి వారుగా ఎన్నిక‌ల‌కు వెళ్లారు.

ఇక‌, ఇప్పుడు మ‌రోసారి పొత్తులు అంటూ.. జ‌న‌సేన‌, టీడీపీ ప‌ల్ల‌వి అందుకున్నాయి. ఈ నేప‌థ్యంలో వీరు ప్ర‌జ‌ల‌కు ఇప్పుడు ఏం చెబుతున్నారు? అనేది ఆస‌క్తిగా మారింది. గ‌తంలో రాష్ట్రానికి హోదా.. ఇత‌ర‌త్రా రావాల్సిన‌వి ఉన్నాయి కాబ‌ట్టి.. పొత్తు పెట్టుకున్నామంటే..జ‌నం విశ్వ‌సించారు. కానీ, ఇప్పుడు ఆ విష‌యాలు ప‌క్క‌న పోయాయి. కేవ‌లం జ‌గ‌న్‌ను ఢీ కొట్టేందుకు తాము క‌లుస్తున్నామ‌ని.. అటు ప‌వ‌న్‌, ఇటు బాబు కూడా సంకేతాలు ఇస్తున్నాయి. ఇది ప్ర‌జ‌ల్లో ఈ రెండు పార్టీల ప‌ట్ల ఎలాంటి ఆలోచ‌న‌ల‌ను స్థిరీక‌ర‌ణ చేస్తాయ‌నేది ఆస‌క్తిగా మారింది.

ఎందుకంటే.. ఒక పార్టీని ఢీకొట్టేందేకు.. కేంద్రంలో ఇలాంటి పొత్తులు స‌హ‌జ‌మే. అతి పెద్ద పార్ల‌మెంటులో స్థానాలు పొంది.. కేంద్రంలోని పార్టీని గ‌ద్దె దించేందుకు ప్ర‌త్యామ్యాయంగా ఇలాంటి పొత్తులు తెర‌మీదికి వ‌చ్చేవి. కానీ, ఇప్పుడు ఏపీలో ఇలాంటి సంస్కృతి రావ‌డంపై.. మేధావులు విస్మ‌యానికి గుర‌వుతున్నారు. ఇది ప్ల‌స్సా.. మైన‌స్సా.. అనేది కూడా చ‌ర్చకు దారితీస్తోంది. ఎందుకంటే.. ఇన్ని పార్టీలు క‌లుస్తున్నా యంటేనే.. వైసీపీ అతిపెద్ద పార్టీ అని ఈ పార్టీలు చెప్ప‌క‌నే చెబుతున్నాయి. అంతేకాదు.. ఈ పార్టీని ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకోవ‌డ‌మూ.. స‌రికాద‌నే సూచ‌న‌లు వ‌స్తున్నాయి. సో.. ఎలా చూసినా.. ఈ పొత్తుల‌పై ప్ర‌జ‌ల మ‌నోగ‌తం తెలుసుకోవాల‌ని అంటున్నారు.