బాబుకు ఘోర అవ‌మానం.. హైద‌రాబాద్‌లోనే ఉన్నా ఇలా జ‌రిగిందే..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఘోర అవ‌మానం జ‌రిగిందా? ఆయ‌న ఊహించ‌ని విధంగా ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టారా? అంటే.. ఔన‌నే అంటున్నారు పార్టీ నాయ‌కులు. ఇదే విష‌యం పార్టీలో గుస‌గుస‌గా మార‌డం గ‌మ‌నార్హం. విష‌యంలోకి వెళ్తే.. హైద‌రాబాద్ శివారులోని ముచ్చింత‌ల్‌లో చిన‌ జీయ‌ర్ స్వామి ఆధ్వ‌ర్యంలో రామానుజాచార్యుల విగ్ర‌హం ప్ర‌తిష్ట‌.. 108 దేశాల పేరుతో ఆల‌యాల నిర్మాణం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి కేంద్రం నుంచి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ వ‌చ్చారు. అదేవిధంగా.. రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కూడా ఈ నెల 14న రాన‌నున్నారు.

ఇక‌, ఈ ఆల‌యాల నిర్మాణం.. స‌హా భూమి ఇచ్చి.. ప్రోత్స‌హించిన నాయ‌కుడిగా.. తెలంగాణ సీఎం కేసీఆర్ పేరు తెచ్చుకున్నారు. ఇక‌, ఆల‌య ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మాల‌కు.. ఏపీ సీఎం జ‌గ‌న్‌ను ఆహ్వానించారు.. చిన్న‌జీయ‌ర్ స్వామి. ఆయ‌న వెళ్లి.. అక్క‌డ కొన్నికార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. అంతేకాదు.. ఈ స‌మ‌యంలో జీయ‌ర్ స్వామి… సీఎం జ‌గ‌న్‌ను ఆకాశానికి ఎత్తేశారు. జ‌గ‌న్ చాలా చిన్న‌వాడ‌ని.. ఎంతో ఫ్యూచ‌ర్ ఉంద‌ని.. ఎన్ని అధికారాలు చేతిలో ఉన్నా..ఆయ‌న అంద‌రికీ విన‌యంగా ఉంటార‌ని.. కూడా కితాబు ఇచ్చారు. ఇక‌, ఇదిలావుంటే.. మ‌రోవైపు.. టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు.. ఎలాంటి ఆహ్వానం అంద‌లేదు.

వాస్త‌వానికి చంద్ర‌బాబు ఇప్పుడు హైద‌రాబాద్‌లోనే ఉంటున్నారు. అక్క‌డి నుంచే పార్టీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. నేత‌ల‌తో జూమ్ మీటింగులు పెడుతున్నారు. అయితే.. అనూహ్యంగా ఆయ‌న‌ను ఈ రామానుజాచార్యులు కార్య‌క్ర‌మానికి ఆహ్వానించ‌క‌పోవ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌గామారింది. నిజానికి చంద్ర‌బాబు ఉమ్మ‌డి ఏపీలో సీఎంగా ఉన్న స‌మ‌యంలోనూ.. గ‌త ఐదేళ్లు న‌వ్యాంధ్ర సీఎంగా ఉన్న‌ప్పుడు కూడా.. చిన్న‌జీయ‌ర్ ఆశ్ర‌మాల‌కు ప్ర‌భుత్వ ప‌రంగా అనుమ‌తులు.. సాయాలు చేశారు. వీరి మ‌ధ్య మంచి రిలేష‌న్ కూడా ఉంది.

అయిన‌ప్ప‌టికీ.. తాజాగా జ‌రిగిన ప్ర‌పంచ స్థాయి కార్య‌క్ర‌మానికి చంద్ర‌బాబును మాత్రం ఆయ‌న ఆహ్వానిం చ లేదు. దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు ఇలా జ‌రిగింది? అనే విష‌యాల‌పై.. పార్టీలోనూ చ‌ర్చ‌కు దారితీసింది. తెలంగాణ‌సీఎం కు చంద్ర‌బాబుకు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి ఉంది. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ క‌నుస‌న్న‌ల్లో సాగిన‌.. ఈ కార్య‌క్ర‌మానికి చంద్ర‌బాబును పిలిచి..ఆయ‌న ఆగ్ర‌హానికి గురి కావడం ఎందుకని చిన్న‌జీయ‌ర్ భావించి ఉంటార‌ని అంటున్నారు. ఏదేమైనా.. ఈ విష‌యం టీడీపీలోనే ఎక్కువ‌గా చ‌ర్చ‌కు దారితీయ‌డం గ‌మ‌నార్హం. జ‌గ‌న్‌ను పిల‌వ‌కుండా.. ఉంటే… ఈ ప‌రిస్థితి ఉండేది కాద‌ని కొంద‌రు అంటున్నారు.