ఆర్ఆర్ఆర్.. సీఐడీ కాదు, ఈసారి సీబీఐ కేసు!

సీఐడీ- సీబీఐ కేసు అనగానే .. ఇదేదో సినిమా ఆర్ఆర్ఆర్ కు సంబంధించిన వ్యవహారం కాదని.. వివాదాస్పద రాజకీయ నాయకుడు రఘురామక్రిష్ణ రాజుకు సంబంధించిన గొడవ అని ఎవరికైనా సులువుగానే అర్థమైపోతుంది. ఆయన ప్రస్తుతం దాదాపు 1300 కోట్ల రూపాయలకు పైగా బ్యాంకు రుణాలను ఎగవేసిన కేసుల్లో సీబీఐ కేసులో ఇరుక్కున్నారు. గతంలో ఆయన మీద ఏపీ సీఐడీ పోలీసులు వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు కేసులు నమోదు చేశారు. అయితే.. ప్రతిసారీ.. జగన్మోహన్ రెడ్డి సీఐడీ పోలీసుల వెనుక ఉండి తనను వేధిస్తున్నట్టుగా ఆయన విరుచుకుపడేవారు. అయితే ఈసారి సీఐడీ కాదు.. ఏకంగా సీబీఐ కేసే! ఏకంగా 1300 కోట్లరూపాయల అప్పులు ఎగ్గొట్టిన కేసు.

బడా పారిశ్రామికవేత్తలు కంపెనీల పేరుతో బ్యాంకుల కన్సార్టియం నుంచి, విడిగా బ్యాంకులనుంచి వందల వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకోవడం కొత్త విషయం కాదు. ఒకసారి అప్పు వచ్చిన తర్వాత.. ఎందుకోసం అయితే అప్పు పుట్టిస్తారో సదరు కంపెనీ ఆవిర్భవిస్తుందో లేదో తెలియదు. ఈలోగా.. ఆ అప్పుతో అనేక రకాల మాయోపాయ లావాదేవీలు ముమ్మరంగా సాగించేసి లబ్ధి పొందుతారు. ఈ మానిప్యులేషన్ లావాదేవీలతోనే చాలా ఎక్కువగా లబ్ధి పడుతూ ఉంటారు కూడా!
ఈ నడమంత్రపు లావాదేవీలతో లాభాలపర్వం పూర్తయిన తర్వాత.. తలిస్తే అప్పు చెల్లిస్తారు. పరవాలేదులే అనుకలుంటే ఎగ్గొట్టి ఆ సొమ్మును కూడా యథేచ్ఛగా వాడేసుకుంటూ ఉంటారు. సాధారణంగా కార్పొరేట్ రుణాల మాయాజాలంలో జరుగుతూండే తంతు ఇదే. ఈ ఆర్థిక అక్రమాలకు పాల్పడే ఏ ఒక్కరూ ఇందుకు మినహాయింపు కాదు. అయితే.. తాను చాలా పరిశుద్ధుడిని అన్నట్టుగా.. జగన్ సర్కారు మీద వెటకారపు నిప్పులు చెరుగుతూ ఉండే ఆర్ఆర్ఆర్.. తన కంపెనీల విషయానికి వచ్చేసరికి ఏకంగా 1300 కోట్ల రూపాయలు ఎగేసిన వ్యవహారంలో దొరికిపోయాడు.

ఆయనకు చెందిన ఇళ్లు, కంపెనీల మీద సీబీఐ దాడులు కూడా జరిగాయి. తాజాగా సీబీఐ ఢిల్లీలోని ఓ కోర్టులో ఆయన మీద చార్జిషీట్ లు దాఖలు చేశారు. అదేఢిల్లీలోని మరో పోలీసు స్టేషనులో సీబీఐ కేసు కూడా నమోదు చేసింది.మామూలుగా అయితే తన మీద ఈగ వాలితేచాలు.. ఆ ఈగను జగన్మోహన్ రెడ్డి.. చేరదీసి సాకి తర్ఫీదు ఇచ్చి తన మీదకు పంపాడని రఘురామక్రిష్ణ రాజు తరచూ అంటూ ఉంటారు. సీఐడీ వారు కేసులు నమోదుచేసినప్పుడు కూడా.. ఇదే తరహాలో.. వాటి వెనుక జగన్ ఉన్నట్టుగా ముడిపెట్టడానికి ఆయన ప్రయత్నించారు. ఇప్పుడు ఏకంగా సీబీఐ కేసులు నమోదు చేసింది. ఇప్పుడేం మాట్లాడుతారు. తన సహజమైన ధోరణిలో.. కంపెనీలు అన్నాక అప్పుడు- ఎగవేయడాలు- సీబీఐ కేసులు అన్నీ మామూలే అని తేల్చేస్తారా? ఏమో చూడాలి.

Share post:

Latest