కరోనా మొదటి దశ.. రెండో దశ అయిపోయింది.. ఇపుడు ఒమిక్రాన్ అంటున్నారు.. దేశంలో పలు చోట్ల కేసులు కూడా నమోదవుతున్నాయి.. జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు..మాస్కు తప్పనిసరి.. గ్రూపులుగా ఉండొద్దని కోవిడ్ నిబంధనలు చెబుతున్నాయి..ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు తీసుకున్న ఓ నిర్ణయం విద్యార్థుల తల్లిదండ్రలును ఇబ్బందులకు గురిచేస్తోంది. పిల్లలకు కచ్చితంగా 75 శాతం హాజరు ఉండాల్సిందే అని నిబంధన పెట్టింది. అలా అటెండెన్స్ ఉన్న స్టూడెంట్స్ కే అమ్మ ఒడి పథకం వర్తిస్తుందని చెబుతోంది. అంటే 75 శాతం కంటే తక్కువ హాజరు ఉంటే రూ.15వేలు రావన్నమాట. దీంతో పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలే కరోనా భయంతో బిక్కు బిక్కు మంటూ బతుకుతున్నాం. చిన్నపిల్లలు.. వారిని రోజూ స్కూలుకు ఎలా పంపుతాం.. పరిస్థితిని బట్టి స్కూలుకు వెళతారు.. రోజులు అసలే బాగాలేవు.. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రూల్ ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కరోనా లేకపోయి ఉంటే ఈ నిబంధనకు ఎవరూ అడ్డు చెప్పరు.. మరి ఇప్పుడు కరోనా రోజులు కదా అని సందేహిస్తున్నారు. గుంటూరు జిల్లాలో అయితే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తల్లిదండ్రలుకు నేరుగా లేఖలు పంపుతున్నారు. 08.11.2021 నుంచి 30.4.2022 వరకు గల 130 పని దినాలలో తప్పనిసరిగా 75 శాతం మీ కుమారుడు లేదా మీ కుమార్తె హాజరు కలిగి ఉండాలని, అప్పుడు మాత్రమే అమ్మ ఒడి వర్తిస్తుందని లేఖ పంపుతున్నారు. ఆ లేఖలు చూసిన అమ్మానాన్నలకు ఏమనాలో అర్థం కావడం లేదు. కరోనా కారణంగా పిల్లలు పాఠశాలకు రావడం తగ్గిస్తారు.. దీంతో హాజరు శాతం తగ్గిపోతోంది.. ఈ కారణం చూపి అమ్మ ఒడి ఇవ్వరేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ నిబంధన తొలగించాలని కోరుతున్నారు. మరి సర్కారుకు వారి ఆవేదన వినిపిస్తుందో, లేదో చూడాలి.