ఏపీలో ఉద్యోగులు అనేక రోజులుగా పే రివిజన్ స్కేల్ (పీఆర్సీ) కోసం ఎదురు చూస్తున్నారు.. దీంతో వారు నిరసన బాట పట్టారు. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసు కూడా ఇచ్చారు.. పీఆర్సీ ఇవ్వకపోతే విడతల వారిగా సమ్మె చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.. సీన్ కట్ చేస్తే సీఎం జగన్ తిరుపతిలో మాట్లాడుతూ.. పది రోజుల్లో పీఆర్సీ ఇచ్చేస్తామని ప్రకటించారు. జేఏసీ నాయకులకు షాక్.. ఇదేంటి మేము సమ్మె చేస్తామని చెబితే పీఆర్సీ ఇచ్చేశారు అని సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారట. అయితే ఇక్కడే జగన్ ట్విస్ట్ ఉంది.. పీఆర్సీ అమలుకు సంబంధించి నోటీసు ఇచ్చిన తరువాత సర్కారు నుంచి చర్చలకు ఆహ్వానం వస్తుందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆశించారు.
ప్రభుత్వంతో మాట్లాడి పీఆర్సీ సాధించుకోవచ్చనేది వారి ఆలోచన. ఉద్యోగ సంఘాలు కూడా ఉద్యోగుల సంక్షేమానికి పాటు పడుతున్నాయని చెప్పాలనేది వారి ప్లాన్. అయితే సీఎం జగన్ ఓ అడుగు ముందుకేసి చర్చలు జరుపకుండానే పీఆర్సీ అమలు చేస్తామని ప్రకటించారు. అంటే.. ఉద్యోగ సంఘాల నాయకులకు ఆ అవకాశమివ్వలేదు. మేము ప్రభుత్వంతో మాట్లాడి పీఆర్సీ తెప్పించాం అని చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. ఇలా చేస్తే ఉద్యోగులు కూడా నాయకులను పెద్దగా పట్టించుకోరు.. మీరు చర్చలు జరుపకుండానే జగన్ పీఆర్సీ ఇచ్చేశాడు అనే సానుభూతిని సంపాదించుకోవడానికి జగన్ ఎత్తుగడ వేసినట్లు సమాచారం. ఊహించని ఈ ట్విస్టుకు ఉద్యోగ సంఘాల నాయకులు షాక్ నుంచి ఇంకా కోలుకోలేదట. సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని జగన్ భావిస్తున్నారట. అందుకే వారికి ఆ చాన్స్ ఇవ్వకుండా ప్రకటించారని తెలిసింది. మరి పీఆర్సీ వచ్చే వరకు ఉద్యోగులు ఎదురు చూడాల్సిందే.