ల్యాండ్ ఫోన్.. బేసిక్ ఫోన్ ఉన్నపుడే అందరూ ప్రశాంతంగా ఉండేవాళ్లు..ఒక్కరి విషయాలు ఒకరికి మాట్లాడితే తప్ప తెలిసేది కాదు.. కానీ స్మార్ట్ ఫోన్ వచ్చిన తరువాత ఆ పరిస్థితి లేదు.. ప్రైవసీ అసలే లేదు.. స్మార్ట్ ఫోన్ మన మనసుల్లోకి తొంగి చూస్తోంది.. ఎప్పుడేం మాట్లాడినా కనిపెట్టేస్తోంది..కనిపెట్టడమే కాదు ఇతరుల చెవుల్లోకి దూరిపోతోంది.. అందుకే స్మార్ట్ ఫోన్ లో మాట్లాడాలంటేనే భయం.. పర్సనల్ విషయాలు అస్సలు మాట్లాడే పరిస్తితి లేదు.. ఎందుకంటే రికార్డింగ్ సౌకర్యం అందులో ఉండటంతో ఏం మాట్లాడాలన్నా భయం.. ఎవరితో మాట్లాడాలన్నా భయం.. రికార్డు చేస్తారేమోనని.. ఇపుడు ఈ భయం టీఆర్ఎస్ పార్టీలోని నాయకులను కలవరపెడుతోంది.
ఆ పార్టీ నాయకులు స్మార్ట్ ఫోన్లో మాట్లాడాలంటనే వణికి పోతున్నారు.ముఖ్యంగా పార్టీ అధినాయకత్వం స్మార్ట్ ఫోన్లు వాడకండి అని అంతర్గతంగా ఆదేశాలు జారీచేసిందట. అసలే స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఓటర్లైన ప్రజా ప్రతినిధులు ఎక్కువగా మాట్లాడితే వారిని ప్రలోభపెట్టే ప్రమాదం కూడా ఉందని బాస్ భయం. ఎందుకంటే గతంలో కౌషిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నపుడు తాను టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తానని మాట్లాడిన ఆడియో ఇప్పటికీ కారు పార్టీ నాయకుల్లో గుబులు రేపుతోంది. అది టీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేసింది కూడా. కౌశిక్ తరువాత ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా ఫోన్ లో ఓ సర్పంచును బెదిరించాడు. ఆ ఆడియో కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. భూ పంచాయితీలో రసమయి సర్పంచుపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఇక కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారు పార్టీ రెబల్ గా పోటీచేస్తున్న రవీందర్ సింగ్ కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులతో టచ్ లో ఉన్నాడని, అక్కడి విషయాలు ఇతనికి వేగంగా చేరిపోతున్నాయనే అనుమానాలు కూడా పార్టీ హై కమాండ్ కు ఉన్నాయట. అందుకే ఎట్టి పరిస్తితుల్లోనూ స్మార్ట్ ఫోన్ వాడకూడదని చెప్పారట. నాయకులు కూడా స్మార్ట్ ఫోన్ ఎందుకులే వాడటం అని దానిని పక్కనపెట్టేశారని సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు నాయకులు స్మార్ట్ ఫోన్ కూ దూరం..దూరంగా ఉంటారు.