ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మీడియా ముందు వెక్కి వెక్కి ఏడ్చిన సీన్ ఇంకా కళ్ల ముందు మెదులుతూనే ఉంది. అది గౌరవసభ కాదు.. కౌరవ సభ.. నా భార్యను అవమానించారు అంటూ చంద్రబాబు నాయుడు రోదించారు. నేను ఆ సభకు వెళ్లను.. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటా అని శపథం చేసి వచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే వంశీ తదితరులు తన కుటుంబంపై, తన భార్యపై అవమానకరంగా మాట్లాడారు అని బాబు ఆరోపించారు. ఆ రెండు రోజులు దీనిపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చంద్రబాబు ఏడుపు సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.
వైసీపీ చేస్తున్న ఈ అవమానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు వివరించాలని పార్టీ చీఫ్ భావించారు. అందుకే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఆడపడుచుల ఆత్మగౌరవ సభలు నిర్వహించాలని పార్టీ పొలిట్ బ్యూరో కూడా నిర్ణయించింది. పార్టీ నాయకులు ఈ కార్యక్రమాలు నిర్వహించాలని అనుకుంటున్న సమయంలో వైసీపీ నేత వల్లభనేని వంశీ టీడీపీ నిర్ణయాలకు చెక్ పెట్టాడు. ‘‘ నేను మాట్లాడింది తప్పే..అందుకే క్షమాపణ చెబుతున్నా.. వెరీ వెరీ సారీ’’ అంటూ మీడియా ముందు బహిరంగ క్షమాపణ చెప్పాడు. దీంతో టీడీపీ నేతల్లో ఒక్కసారిగా ఖంగుతిన్నారు. వైసీపీ తీసుకున్న ఈ పొలిటికల్ స్టెప్ ను తలపండిన దేశం నాయకులు ఊహించలేకపోయారు. అరె.. వంశీ ఏంటి ఇలా చేశాడు? మా ప్లాన్ అంతా పాడు చేశాడే అని మదనపడుతున్నారని సమాచారం.
ఎందుకంటే తప్పు చేసిన వ్యక్తి సారీ చెప్పిన తరువాత అవమానం జరిగిందని జనం వద్దకు వెళితే ఎలా అని కొందరు పేర్కొంటున్నారు. తప్పు జరిగింది అని వాళ్లే ఒప్పుకుంటున్నారు.. తప్పు తెలుసుకున్నారు.. క్షమాపణ చెప్పిన తరువాత మళ్లీ అదే సమస్యపై ఏం మాట్లాడాలని నాయకులు బాబుతో అన్నట్లు తెలిసింది. ఏదైనా జనం సమస్య పరిష్కారానికి ప్రజల వద్దకు వెళ్లవచ్చు కానీ.. అవమానం జరిగిందని వెళితే పెద్దగా స్పందన కూడా ఉండదని కూడా బాబుతో అన్నట్లు తెలిసింది. దీంతో నారా చంద్రబాబు నాయుడు అవుననలేక.. కాదనలేక సైలెంటయ్యాడట.