ఖమ్మం కాంగ్రెస్ లో వార్

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మం ప్రత్యేకం.. రాష్ట్రం మొత్తం టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటే ఖమ్మం జిల్లా మాత్రం కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతోంది. తెలుగుదేశం పార్టీకి కూడా ఆ జిల్లాలో మంచి ఓటు బ్యాంకు ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా బతికి బట్టకడుతోందంటే ఖమ్మం జిల్లా వల్లే అని చెప్పవచ్చు. అయితే ఇపుడు ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు రాజ్యమేలుతున్నాయి. నువ్వా.. నేనా అంటూ రెండు గ్రూపులు పోటీ పడుతుండంతో కార్యకర్తలు, కిందిస్థాయి నాయకులు తలలు పట్టుకుంటున్నారు.

ముఖ్యంగా టీకాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ రేణుకా చౌదరి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా పార్టీలో పట్టుకోసం భట్టి, రేణుకలు ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటున్నారు. సాధారణంగా ఇతర పార్టీల ఎత్తులను గమనిస్తూ పై ఎత్తులు వేస్తారు కానీ ఇక్కడ మాత్రం కాస్త డిఫరెంట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. భట్టి విక్రమార్క ఇటీవల ఎమ్మెల్సీ టికెట్ ను తన వర్గానికి చెందిన నాగేశ్వర్ రావుకు ఇప్పించుకున్నారు. దీంతో రేణుక దీనిపై అధిష్టానంతో అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. నాగేశ్వర్ రావుకు మద్దతుగా ప్రచారం కూడా చేయలేదని తెలిసింది. జిల్లా పార్టీలో నెలకొన్న ఈ వ్యవహారం రాష్ట్ర నాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఈ పరిణామాలను అధికార టీఆర్ఎస్ పార్టీ నిశితంగా గమనిస్తోంది. కిందిస్థాయి నాయకులు కాస్త బలమైన వారు, పట్టున్న వారు ఉంటే వెంటనే గులాబీ గూటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.