పవన్‌తో స్నేహం కోసం లీకులిప్పిస్తున్న చంద్రబాబు

తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు.. వచ్చే ఎన్నికల నాటికి.. పవన్ కల్యాణ్ తో తిరిగి జట్టుకట్టి.. బరిలో దిగాలని ఉవ్విళ్లూరుతున్నారా? జగన్మోహన రెడ్డి హవాను ఒంటరిగా ఎదుర్కొనే సత్తాలేదనే భయం చంద్రబాబులో ఉందా? జగన్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు వాటికి లభిస్తున్న ప్రజాదరణ.. వచ్చే ఎన్నికల్లో కూడా ఓటింగ్ సరళిని ప్రభావితం చేస్తే.. ఇక తెలుగుదేశానికి భవిష్యత్తు ఉండదని ఆయన వెన్నులో చలి మొదలైందా? అందుకోసం.. పవన్ కు ఉన్న అంతో ఇంతో బలాన్ని కూడా కలుపుకుని వెళ్లాలనుకుంటున్నారా..? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తోంది. అలాంటి పనిచేస్తే.. ప్రజల స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి.. చంద్రబాబు తమ పార్టీ వారిద్వారా లీకులు ఇప్పిస్తున్నట్టుగా కనిపిస్తోంది.

తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు, శాసనమండలి మాజీ ఛైర్మన్ అహ్మద్ షరీఫ్ తాజాగా ఒక మాట అన్నారు. వచ్చే 2024 ఎన్నికల నాటికి.. తెలుగుదేశం జనసేన రెండు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయని అన్నారు. ఆయన ఇచ్చిన లీకుల్లో ఇంకో కీలకమైన విషయం కూడా ఉంది. ఈ రెండు పార్టీలతో పాటు.. అదే జట్టులో వామపక్షాలు కూడా ఉంటాయిట. అందరూ కలిసి.. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ఒక్కటే లక్ష్యంగా ఎన్నికల బరిలో దిగుతారట.

మండలిమాజీ ఛైర్మన్ షరీఫ్ మాటల్ని పట్టించుకోకుండా వదిలేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన పాలిట్ బ్యూరో సభ్యుడు! అలాంటి నేపథ్యంలో ఆయన మాటల్ని సీరియస్ గా పరిగణనలోకి తీసుకుంటే గనుక.. చంద్రబాబునాయుడు చాలా పెద్ద స్కెచ్చే వేసినట్టుగా కనిపిస్తోంది. ఆయనకు కావాల్సింది కేవలం పవన్ కల్యాణ్ తో స్నేహం మాత్రమే కాదు! పవన్ కల్యాణ్- బీజేపీ నుంచి విడిపోవడం కూడా. వారిద్దరూ విడిపోకుండా.. పవన్ మరియు వామపక్షాలతో పొత్తు పెట్టుకోవడం అనేది సాద్యం కాని సంగతి.

వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు తొలినుంచి కూడా.. చంద్రబాబు- పవన్ కల్యాణ్ మధ్య అనుబంధం గురించి అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇద్దరి మధ్య లోపాయికారీ ఒప్పందం ఉన్నదని.. పైకి మాత్రమే వారు వైరిపక్షాలలాగా నటిస్తున్నారని వారు అంటూ వస్తున్నారు. ఇప్పుడు షరీఫ్ మాటలను గమనిస్తే.. అదంతా నిజమే అని తెలిసిపోతోంది. షరీఫ్ ద్వారా లీకులు ఇప్పించి.. ప్రజల స్పందన ఎలా ఉంటుందో గుర్తించిన తర్వాత.. దానిని బట్టి చంద్రబాబునాయుడు మళ్లీ పావులు కదుపుతారని అర్థమవుతోంది.

Share post:

Latest