ఆర్ఆర్ఆర్ రిలీజ్ : సరిహద్దులు దాటి వెళ్లనున్న ఫ్యాన్స్..!

రామ్ చరణ్ – ఎన్టీఆర్- రాజమౌళి కాంబినేషన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్. జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి తర్వాత విడుదలవుతున్న సినిమా కావడంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఈ సినిమాలో ఇద్దరు అగ్ర హీరోలు కలిసి నటించడంతో ప్రేక్షకులు ఈ మూవీ విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మామూలుగా ఒక అగ్ర హీరో నటించిన సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ ఆ సినిమా బెనిఫిట్ షో చూసేందుకు అర్ధరాత్రి నుంచి ఎదురు చూస్తూ ఉంటారు.

అయితే ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వం బెనిఫిట్ షో లను రద్దు చేసింది. దీంతో ఉదయం 11 :30 గంటల మార్నింగ్ షో కోసం అభిమానులు వేచి ఉండాల్సి ఉంటుంది. అయితే తెలంగాణలో ఈ సినిమా ప్రీమియర్ షోలు వేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతోపాటు బెనిఫిట్ షో ఎలాగూ ఉంటుంది. దీంతో ఎన్టీఆర్, చరణ్ అభిమానులు హైదరాబాద్ తో పాటు ఇతర పట్టణాలకు ఒకరోజు ముందుగానే వెళ్లి ఆర్ఆర్ఆర్ సినిమాను చూసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ ట్రైలర్ తోనే ఎంతో ఆకట్టుకుంది. అభిమానులు ట్రైలర్ ను చూసేందుకే సినిమా థియేటర్లకు వెళ్లారంటే ఈ సినిమా పై ఎటువంటి అంచనాలు ఉన్నాయో అర్థమవుతుంది. అందువల్లే సినిమా విడుదల రోజు 11 గంటల వరకు వేచి చూడకుండా ముందుగానే సినిమాను వీక్షించేందుకు సరిహద్దులు దాటేందుకు సిద్ధమవుతున్నారు.

ఒక్క తెలంగాణలోనే కాదు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో కూడా బెనిఫిట్ షోలకు అనుమతి ఉండడంతో ఆయా రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న ఏపీ జిల్లాల నుంచి ఫ్యాన్స్ బెనిఫిట్ షో చూసేందుకు సరిహద్దులు దాటడానికి ప్లాన్ వేసుకుంటున్నట్లు సమాచారం. కర్నూలు జిల్లా వారికి తెలంగాణ రాష్ట్రం దగ్గరగా ఉంటుంది. అలాగే నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు తమిళనాడు సమీపంలోనే ఉంటుంది. ఇక అనంతపురం జిల్లాకు కర్ణాటక సరిహద్దు సమీపంలో ఉంటుంది. దీంతో ఈ నాలుగు జిల్లాల అభిమానులు సరిహద్దులు దాటి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ సినిమాను ముందుగానే చూసేందుకు ప్లాన్ చేస్తున్నారు.