సినీ పరిశ్రమలో ఒకే కుటుంబం నుంచి వచ్చి ఓ వెలుగు వెలుగుతున్న తారలెందరో ఉన్నారు. అలాగే ఎంత మంది స్టార్లు తమ బంధువులను, సన్నిహితులను, స్నేహితులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కానీ, వాళ్ల మధ్య ఉన్న రిలేషన్స్ మాత్రం ప్రేక్షకులకు తెలియదనే చెప్పాలి. ఇకపోతే రచయితగా, నటుడుగా, దర్శకుడుగా, నిర్మాతగా సత్తా చాటిన పోసాని కృష్ణ మురళి, టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకడైన కొరటాల శివ చాలా దగ్గర బంధువులని మీకు తెలుసా?
పోసాని కృష్ణ మురళికి కొరటాల శివ స్వయాన మేనల్లుడు అవుతాడు. కానీ, వీరి బంధుత్వం మాత్రం పెద్దగా ఎవరికీ తెలియదు. కొరటాలను పోసాని కృష్ణ మురళి ఎత్తుకుని పెంచారట. ఈ విషయాన్ని పోసాని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. అంతే కాదు, తన పెళ్లి చూపులకు కొరటాలను తీసుకెళ్లానని అతను సూచించిన అమ్మాయినే తాను పెళ్లి చేసుకున్నట్టు కూడా చెప్పారు.
ఇక బీటెక్ పూర్తిచేసిన కొరటాల శివ.. 1998లో ఉద్యోగం చేసుకుంటూ పోసాని కృష్ణ మురళి దగ్గర సహాయకుడిగా చేరాడు. ఈ క్రమంలోనే ఆయన ఒక్కడున్నాడు, మున్నా, బృందావనం, ఊసరవెల్లి వంటి సినిమాలకు మాటల రచయితగా పనిచేశాడు. 2013లో ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి సినిమాతో దర్శకుడిగా మారాడు.
ఆ తర్వాత మహేష్ బాబుతో శ్రీమంతుడు, ఎన్టీఆర్‌తో జనతా గ్యారేజ్, మళ్లీ మహేష్ బాబుతో భరత్ అనే నేను చిత్రాలు చేసి వరుస హిట్లను ఖాతాలో వేసుకున్న కొరటాల శివ.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా.. కొరటాల తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఎన్టీఆర్‌తో ప్రకటించిన సంగతి తెలిసిందే.