యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మించిన ఆ చిత్రంలో బాలీవుడ్ భామ అలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా.. అజయ్ దేవ్గన్, శ్రీయలు కీలక పాత్రలను పోషించారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ మేకర్స్ నిన్న ముంబైలో ప్రమోషనల్ ఈవెంట్‌ను నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్‌లో రాజమౌళి స్పీచ్ ఆకట్టుకుంది. ఆయన మాట్లాడుతూ.. `చాలా మంది రాంచరణ్, ఎన్టీఆర్ మధ్య తేడా ఏంటి అని నన్ను అడిగారు.
రాంచరణ్ లోతైన నది లాంటి వ్యక్తి. పైకి ప్రశాంతంగా, కామ్ గా కనిపించినా లోపల చాలా పొటెన్షియల్ ఎనెర్జీ ఉంటుంది. తారక్ భయంకర శబ్దంతో జాలువారే జలపాతం లాంటి వ్యక్తి. అంతటి శక్తి అతనిలో ఉంది. ఇక రాంచరణ్ అద్భుతమైన నటుడు.. ఆ విషయం అతనికి తెలియదు. ఎన్టీఆర్ కూడా అద్భుతమైన నటుడే.. అయితే ఆ సంగతి అతనికి తెలుసు` అంటూ చెప్పుకొచ్చారు.
దీంతో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, ఆర్ఆర్ఆర్ విషయానికి వస్తే..స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా కల్పిత కథతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఇందులో గోండు వీరుడు కొమరంభీమ్ గా ఎన్టీఆర్… అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనువిందు చేయబోతున్నారు.