ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో ముచ్చటగా మూడో సారి తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యర్నేని, రవి శంకర్ లు నిర్మించిన ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటించింది. ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా వస్తుండగా.. మొదటి పార్ట్ `పుష్ప ది రైజ్` నిన్న సౌత్ భాషలతో పాటు హిందీలోనూ గ్రాండ్‌గా విడుదలైంది.
ఎర్రచందనం సిండికేట్ లోని ఓ కూలీ ఆ వ్యాపరంలో డాన్ లా ఎలా ఎదిగాడనేది ఈ సినిమా. కథలో కొత్తదనం లేకపోయినా పుష్పరాజ్‌గా బన్నీ నటన, సుకుమార్ టేకింగ్, విజువల్స్, సాంగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఇక టాక్ ఎలా ఉనప్పటికీ.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతూ విధ్వాంసం సృష్టించింది.
ముఖ్యంగా నైజాంలో మొదటి రోజు సూపర్ కలెక్షన్స్ రాబట్టి బాహుబలి, సాహో, వకీల్, సాబ్ చిత్రాల రికార్డులను చిత్తు చిత్తు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నైజాంలో పుష్ప రూ. 36 కోట్లు బిజినెస్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తొలి రోజే అక్కడ ఈ చిత్రం రూ.11.44 కోట్ల షేర్‌ను కొల్లగొట్టింది. దీంతో నైజాంలో ఇప్పటి వరకు అత్యధిక షేర్ వసూల్ చేసిన తొలి చిత్రంగా పుష్ప నిలిచింది.
ఆ తర్వాత స్థానంలో సాహో(9.41 కోట్లు), బాహుబలి 2(8.9 కోట్లు ), వకీల్ సాబ్ (8.75 కోట్లు), సరిలేరు నీకెవ్వరు(8.67 కోట్లు), సైరా(8.10 కోట్లు), మహర్షి(6.38 కోట్లు), బాహుబలి 1(6.32 కోట్లు) చిత్రాలు నిలిచాయి. మొత్తానికి నైజాంలో పుష్ప రాజ్ దుమ్ముదులిపేయడంతో.. బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.