ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీస్టారర్ల హవా నడుస్తోంది. ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి తెలుగులో మల్టీస్టారర్ల హంగామా మొదలైంది. ఇప్పుడు మరో క్రేజీ మల్టీస్టారర్ మూవీ రూపుదిద్దుకోనున్న ట్లు తెలుస్తోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఒక సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తారని చెబుతున్నారు. ఇప్పటికే కథ రెడీ అయిందని కూడా వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఖైదీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ కూడా మహేష్,చరణ్ లతో ఒక మల్టీస్టారర్ సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. నిజంగా ఈ సినిమా దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తుందా.. లేక లోకేష్ కనకరాజ్ కు ఈ ఇద్దరు హీరోలు ఒకే చెబుతారా.. అన్న ఈ విషయమై స్పష్టత రావాల్సి ఉంది.
మహేష్ ఇప్పటికే వెంకటేష్ తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే మల్టీ స్టారర్ సినిమాలో నటించాడు. ఇక చరణ్ ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ అనే భారీ మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో మహేష్,చరణ్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. వాళ్ళిద్దరూ కలిసి సినిమా ఫంక్షన్లతో పాటు, వ్యక్తిగతంగా కూడా కలుసుకుంటూ ఉంటారు. వారిద్దరూ సన్నిహితంగా మెలుగుతున్నారు కాబట్టే వారి కాంబినేషన్ లో సినిమా తీసేందుకు దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై అఫీషియల్ గా ప్రకటన రావాల్సి ఉంది.