దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా త్రిబుల్ ఆర్. గత రెండు సంవత్సరాల నుంచి ఊరిస్తూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ఎన్నో అవరోధాలు దాటుకుని వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన థియేటర్లలోకి దిగుతుంది. త్రిబుల్ ఆర్ ప్రపంచ వ్యాప్తంగా 14 భాషల్లో రిలీజ్ అవుతోంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత డివివి దానయ్య రు. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, ట్రైలర్లు సినిమాపై ఉన్న అంచనాలను ఆకాశం లోకి తీసుకు వెళ్లిపోయాయి. ప్రస్తుతం రాజమౌళి – ఎన్టీఆర్ – రామ్ చరణ్ ముగ్గురు దేశవ్యాప్తంగా పలు భాషల్లో ఈ సినిమాను భారీ ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే ముంబైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. హిందీ ప్రమోషన్‌లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా పాల్గొన్నారు. గత రాత్రి చెన్నైలో జరిగిన ఈవెంట్ కు కోలీవుడ్ యువ హీరో, డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ కూడా హాజరయ్యారు.
త్రిబుల్ ఆర్ ప్రమోషన్లు సౌత్ నుంచి నార్త్ వరకు మామూలుగా జరగటం లేదు. ఇక ఈ ప్రమోషన్లలో మహేష్ – రాజమౌళి సినిమా ఎప్పుడు వస్తుందని ఎన్టీఆర్ ను ఒక యాంకర్ అడిగారు. దీంతో ఎన్టీఆర్ సరదాగా ఈ ప్రాజెక్టు 2026 లో వస్తుందని చెప్పాడు. ఎన్టీఆర్ మాటలను బట్టి చూస్తే మహేష్ – రాజమౌళి సినిమా వచ్చేందుకు మరో నాలుగు సంవత్సరాలు పడుతుందని పరోక్షంగా రాజమౌళి టైం టేకింగ్ పై సెటైర్లు వేసినట్టు ఉంది. ఆ వెంటనే రాజమౌళి మాట్లాడుతూ ఆ సినిమాకు అంత టైం తీసుకో అని చెప్పారు.
అయితే ఎన్టీఆర్ మరోసారి మాట్లాడుతూ ఎలాంటి కోవిడ్‌లు రాకుండా ఉంటే 2025 లో మహేష్ – రాజమౌళి సినిమా వస్తుందని మళ్లీ చిన్న చమక్ ఇచ్చాడు. ఎలా లేదన్నా మహేష్ సినిమా కోసం రాజమౌళి మరో మూడు సంవత్సరాలు టైం తీసుకుంటాడని ఎన్టీఆర్ మాటల్లో వ్యక్తం అయింది.
ఇక దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత డాక్టర్ కెఎల్. నారాయణ మహేష్ బాబు – రాజమౌళి సినిమాను నిర్మించనున్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు పరశురాం దర్శకత్వంలో నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా పూర్తయిన వెంటనే రాజమౌళి సినిమా పట్టాలు ఎక్క నుంది. అయితే రాజమౌళి సినిమా కంటే ముందు మహేష్ -త్రివిక్రమ్ సినిమా కూడా పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.