ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల పెంపుపై హైకోర్టు డివిజన్ బెంచ్ ట్విస్ట్ ఇచ్చింది. కొన్ని రోజులుగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కి, ఏపీ ప్రభుత్వానికి మధ్య సినీ రంగ సమస్యల పరిష్కారం, టికెట్ల ధరలు తగ్గించడం వంటి అంశాలపై వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. సినిమా టికెట్లను ప్రభుత్వం తీసుకొచ్చే ఆన్లైన్ టికెట్ విధానం ద్వారానే విక్రయించాలని, బెనిఫిట్ షోలు నిషేధిస్తూ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను కూడా తగ్గించింది. దీనిపై టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే. పలువురు సినీ పెద్దలు ప్రభుత్వ నిర్ణయంపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు.
ఏపీలో టిక్కెట్ల ధరల పై డిస్ట్రిబ్యూటర్లు ఇటీవల హైకోర్టుకు వెళ్లగా.. సింగిల్ జడ్జి ప్రభుత్వం ఇచ్చిన జీవో 35ను రద్దు చేసి సినిమా విడుదల సమయంలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించారు. అయితే ప్రభుత్వం సింగిల్ జడ్జి తీర్పుపై డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది.దీనిపై ఇవాళ విచారణ నిర్వహించిన డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చిన కాపీ అందకపోవడంతో విచారణను రేపటికి వాయిదా వేసింది.
అయితే టిక్కెట్ల ధరల పై వెంటనే విచారణ చేపట్టకపోతే ధరలు పెంచి అమ్ముకునే అవకాశం ఉందని ప్రభుత్వం తరఫున న్యాయవాది వెల్లడించారు. ఈ వాదనలు విన్న హైకోర్టు రేపు ఉదయమే ఈ కేసును విచారిస్తామని వెల్లడించింది. ఆలోగా టికెట్ ధరపై ప్రతిపాదనలను థియేటర్ యజమానులు ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్ల ముందుంచాలని ఆదేశించింది. టికెట్ ధర పెంపుపై జాయింట్ కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వం కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయించాలని సూచించింది.