అసలు అఖండ చిత్రం ఎందుకు హిట్ అయ్యింది.. ఏది నిజం?

టాలీవుడ్‌లో ఇటీవల రిలీజ్ అయిన ‘అఖండ’ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నందమూరి నటసింహం బాలకృష్ణ నటించగా, మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను ఈ సినిమాను అత్యంత ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాతో బాలయ్య-బోయపాటి కాంబినేషన్ గ్యారెంటీ హిట్ కొడుతుందని అందరూ ముందుగానే ఎక్స్‌పెక్ట్ చేశారు. అనుకున్నట్లుగానే ఈ సినిమా బాక్సాఫీస్‌ను ఓ రేంజ్‌లో ఊపేసింది. ఎక్కడ చూసినా ‘జై బాలయ్యా…’ అంటూ అఖండ హవా కొనసాగింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన పది రోజుల్లోనే ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బాక్సాఫీస్ నిపుణులను సైతం అవాక్కయ్యేలా చేసింది.

దీంతో బాలయ్య కెరీర్‌లో ఈ సినిమా ఓ మైల్‌స్టోన్ మూవీగా నిలిచింది. బోయపాటి ఈ సినిమాను తెరకెక్కించిన విధానం కామన్‌గానే ఉన్నా, బాలయ్యను చూపించిన విధానం మాత్రం సూపర్బ్ అని చెప్పాలి. అఖండ పాత్రలో బాలయ్య పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లడంలో ఇదే ముఖ్య కారణం అని కూడా చెప్పాలి. దీంతో పాటు సంగీత దర్శకుడు థమన్ అందించిన బీజీఎం ఈ సినిమాకు మరో మేజర్ అసెట్. ఈ సినిమా బీజీఎం ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించిందని వారే స్వయంగా చెప్పడం విశేషం. ఇక ఈ సినిమా మరింత స్పీడుతో దూసుకెళ్తుండటంతో మరో వారం పాటు ఈ సినిమా దిగ్విజయంగా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

అయితే ఓ సాధారణ ప్రేక్షకుడికి మాత్రం ‘అఖండ’ చిత్ర అఖండమైన విజయం నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. బాలయ్య సినిమాలో ఉండే యాక్షన్ సీక్వెన్స్‌లు, డైలాగులు షరామామూలే అన్నట్లుగా ఈ సినిమాలో కూడా ఉన్నాయి. కానీ కరోనా కారణంగా రెండేళ్ల వరకు థియేటర్‌లో ఊరమాస్ బొమ్మను చూడక తెలుగు ప్రేక్షకులు చప్పబడటం, ఇప్పుడు వారి ఆకలిని తీర్చే అంశాలు ఈ సినిమాలో ఉండటమే అఖండ విజయానికి ముఖ్య కారణమని చెప్పాలి.

ఇక ఆ హీరో, ఈ హీరో అనే తేడా లేకుండా అందరి ఫ్యాన్స్ ‘జై బాలయ్య’ నినాదాన్ని ఓ ఎమోషన్‌గా భావించి ఈ సినిమాను మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేశారనేది అందరికీ తెలిసిన వాస్తవం. అందుకే ఈ సినిమాకు చిన్నా,పెద్దా, ముసలి ముతకా అనే భేదం లేకుండా అందరూ వచ్చి ఈ సినిమాను పిచ్చపిచ్చగా ఎంజాయ్ చేశారు. ఎలాంటి ఆకట్టుకునే కథాకథనం లేకపోయినా, ఎక్కువగా ఆకట్టుకునే పాటలు లేకపోయినా, బాలయ్య రొటీన్ యాక్షన్ అయినా.. ఈ సినిమాను బోయపాటి ఎలా చూపించాలని భావించాడో అలానే చూపించడంతో ఈ సినిమా సాధారణ ప్రేక్షకుడికి సైతం నచ్చిందని చెప్పాలి. అందుకే బాలయ్య ఈ సినిమాతో ‘అఖండ’మైన విజయం అందుకున్నాడనేది వాస్తవం.