ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్).. ఉమ్మడి ఏపీలో రాజకీయాల్లో చురుగ్గా ఉన్న వ్యక్తి.. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం.. హస్తం పార్టీకి తెలంగాణలో పెద్దగా ఆదరణ లేకపోవడంతో డీఎస్ కారు పార్టీ ఎక్కాడు. ఆయనకున్న ఇమేజిని ద్రుష్టిలో పెట్టుకున్న కేసీఆర్ రాజ్యసభకు పంపాడు. అయితే ఎందుకో రెండు, మూడేళ్లుగా ఆయన గులాబీ పార్టీలో అయిష్టంగానే ఉన్నాడు. ఉమ్మడి ఏపీలో ఆయన హవానే వేరు.. వైఎస్, డీఎస్ అప్పట్లో కాంగ్రెస్ పార్టీని శాసించారని కూడా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత డీఎస్ టీఆర్ఎస్ కండువా కప్పుకున్నా కేసీఆర్ తో పెద్దగా సఖ్యతగా లేకపోయారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన కే.కేశవరావు మాత్రం కారులో ఇమిడిపోయి రాజ్యసభకు నామినేట్ అయి.. ఆ తరువాత కూతురును మేయర్ సీట్లో కూడా కూర్చోబెట్టారు. అయితే డీఎస్ మాత్రం కేకేలా సక్సెస్ కాలేకపోయారని చెప్పవచ్చు. కేకేలాగ డీఎస్ కూడా 2016లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. వచ్చే సంవత్సరం జూన్ వరకు ఆయన పదవీ కాలం ఉంది. అయితే డీఎస్ కుమారుడు బీజేపీ నుంచి ఎంపీగా పోటీచేసి నిజామాబాద్ నుంచి ఏకంగా టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితపైనే గెలవడం చర్చనీయాంశమైంది.
డీఎస్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కుమారుడిని అదుపు చేయలేకపోయాడని.. దీంతో పార్టీ పరువు పోయిందని గులాబీ బాస్ కినుక భావిస్తున్నారట. ఆ తరువాత డీఎస్ పై కవిత అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో ఇద్దరి మధ్యా గ్యాప్ బాగా పెరిగింది. అప్పటినుంచి కారు పార్టీలో డీఎస్ నామమాత్రంగా ఉండిపోయారు. ఓ సమయంలో ఆయన బీజేపీలో చేరతారనే ఊహాగానాలు కూడా వచ్చాయి. అయితే అలాంటివేం జరగలేదు. మళ్లీ ఇపుడు సొంత గూటికి (కాంగ్రెస్ పార్టీలోకి) వెళ్లాలని భావిస్తున్నాడట. ఈ ఆలోచనతోనే సోనియాను గురువారం కలిసి చర్చలు జరిపారు. దాదాపు 40 నిమిషాల పాటు సోనియాతో చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వస్తానని డీఎస్ చెప్పడం.. సోనియా సరే అనడం చకచకా జరిగిపోయాయట. త్వరలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇదే జరిగితే కుమారుడు బీజేపీలో..తండ్రి కాంగ్రెస్ పార్టీలో.. ఏమైనా రాజకీయమా..