అఖండ బ్లాక్ బస్టర్ : ఊపిరి పీల్చుకున్న టాలీవుడ్..!

ఇదివరకు ఎప్పుడూ లేనిది అఖండ సినిమా విడుదల కోసం చిత్ర పరిశ్రమలోని నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, అన్ని విభాగాల సిబ్బంది ఆసక్తిగా ఎదురు చూశారు. దానికి కారణం కరోనానే. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత ప్రేక్షకులు సినిమా థియేటర్ కు వచ్చి సినిమాలు చూడడం తగ్గిపోయింది. సినిమాలు బాగున్నాయి.. అని టాక్ వచ్చినా.. ప్రేక్షకులు థియేటర్ కు రావడం పై ఆసక్తి చూపలేదు. దీంతో సినీ ఇండస్ట్రీలో ఒక భయం పట్టుకుంది. ఇప్పటికే మొదలైన సినిమాలు, పూర్తయిన సినిమాల పరిస్థితి ఏంటా.. అని దిగులు చెందారు.

అయితే సెకండ్ వేవ్ తర్వాత నాగ చైతన్య -శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో వచ్చిన లవ్ స్టోరీ సినిమా మంచి వసూళ్లనే సాధించడంతో ఒక్కొక్కరు తమ సినిమాలను విడుదల చేయడం మొదలు పెట్టారు. అయితే భారీ చిత్రాలు, పాన్ ఇండియా స్థాయి సినిమాలను మాత్రం విడుదల చేయలేదు. 100% ఆక్యుపెన్సీ కోసం చాలా రోజులు ఎదురు చూశారు. ఈ క్రమంలో మొదటిగా విడుదలైన అగ్రహీరో సినిమా అఖండ.

ఈ సినిమా విడుదలకు ముందు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రతి ఒక్కరూ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపి మూవీ విజయవంతం కావాలని కోరుకున్నారు. ఈ సినిమా విజయం పైన ఇతర భారీ సినిమాల విడుదల ఆధారపడి ఉండడంతో అఖండ విడుదలపై ఆసక్తి నెలకొంది. దానికి తోడు ఏపీలో సినిమా టికెట్ల ధరలు కూడా తగ్గడంతో సరైన వసూళ్లు వస్తాయో రావో అని నిర్మాతలు భావించారు. అయితే అఖండ సినిమా విడుదలై ప్రేక్షకులను థియేటర్లకు భారీగా రప్పించి అందరిలో ఉన్న సందేహాలను పటాపంచలు చేసేసింది. ఏపీలో టికెట్ల ధరలు తక్కువ ఉన్నప్పటికీ అఖండ భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టుకుంది.

అఖండ సినిమా ఇదివరకు బాలకృష్ణ నటించిన సినిమాల రికార్డులను బద్దలు కొట్టడంతో పాటు బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలవడంతో సినీ ఇండస్ట్రీ ఊపిరిపీల్చుకుంది. అఖండ ఇచ్చిన ఊపుతో టాలీవుడ్ లో నుంచి వరుసపెట్టి అగ్ర హీరోలు నటించిన చిత్రాలు విడుదల అవుతున్నాయి. ఈనెల 17వ తేదీన అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కానుంది. అలాగే డిసెంబర్ 24న నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ కూడా తెరపైకి రానుంది. క్రిస్మస్ కి వరుణ్ తేజ్ హీరోగా నటించిన గని కూడా విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

ఇక జనవరి 7న దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్న రాజమౌళి-ఎన్టీఆర్ -రామ్ చరణ్ సినిమా ఆర్ఆర్ఆర్ దేశంలోని పలు భాషలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్, ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ 14న విడుదల కానున్నాయి. ఏదిఏమైనా అఖండ సినిమా విజయం నిర్మాతలకు ఎంతో భరోసా ఇచ్చింది.

Share post:

Popular