దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. జనవరి 7వ తేదీన ఈ సినిమా దేశంలోని పలు భాషల తో పాటు, ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రూ.450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ పై భారీగా అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదలకు ఎక్కువ సమయం లేకపోవడంతో జక్కన్న వరుసబెట్టి ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా ఇవాళ ఉదయం కొమరం భీమ్ లుక్ లో ఎన్టీఆర్ ను కండలు తిరిగిన దేహంతో చూపించాడు. ఇది సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. అలాగే సాయంత్రం నాలుగు గంటలకు ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ సీతారామరాజు లుక్ ను విడుదల చేశారు. పోలీస్ గెటప్ లో చరణ్ అద్భుతంగా ఒదిగిపోయాడు. మెలితిరిగిన మీసంతో గర్జిస్తున్న లుక్ లో చరణ్ అదిరిపోయాడు.
ఈ పోస్టర్ విడుదలైన క్షణాల్లోనే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇదివరకే కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ను పరిచయం చేస్తూ రాజమౌళి పోస్టర్లు విడుదల చేసినప్పటికీ.. ఈ పోస్టర్లు మాత్రం ప్రత్యేకంగా ఉన్నాయి.
కాగా ఈ నెల 9వ తేదీన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదల కానుంది. ఇవాళ విడుదల చేసిన రెండు పోస్టర్లలో ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాలో అలియాభట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా..బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్, వెటరన్ హీరోయిన్ శ్రీయ, సముద్రఖని తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తుండగా ఎమ్. ఎమ్. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.