అల్లు అర్జున్ రెండో అన్న రాజేష్‌ ఎలా చ‌నిపోయాడో తెలుసా?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌డా ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ సొంత టాలెంట్‌తో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న అల్లు అర్జున్‌.. త్వ‌రలోనే `పుష్ప‌` సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా కూడా మారబోతున్నాడు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. మొద‌టి భాగాన్ని డిసెంబ‌ర్ 17న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కాబోతోంది.

ఈ విష‌యాలు ప‌క్క‌న పెడితే.. అల్లు అర్జున్ సోద‌రులు ఎవ‌రూ అంటే ట‌క్కున అంద‌రూ అల్లు శిరీష్‌, అల్లు బాబీ(వెంక‌ట్‌) అని చెప్పేస్తుంటారు. అల్లు అర్జున్ అన్న బాబీ నిర్మాత‌గా రాణిస్తుంటే.. త‌మ్ముడు శిరీష్ హీరోగా ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. అయితే వీరిద్ద‌రూ కాకుండా బ‌న్నీకి మ‌రో సోద‌రుడు కూడా ఉండేవాడు. అత‌డే అల్లు రాజేష్‌. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

బ‌డా నిర్మాత అల్లు అర‌వింద్, నిర్మ‌ల దంప‌తుల‌కు మొద‌ట అల్లు బాబీ, ఆ త‌ర్వాత అల్లు రాజేష్‌, ఆపై అల్లు అర్జున్ జ‌న్మించారు. అయితే రాజేష్‌కు ఏడేళ్ల వ‌య‌సు ఉన్న‌ప్పుడు రోడ్డు యాక్సిడెంట్‌లో మృతి చెందాడు. కొడుకు మ‌ర‌ణం అల్లు అర‌వింద్ దంప‌తుల‌ను తీవ్రంగా క‌ల‌చి వేసింది.

అయితే రాజేష్ మరణం తట్టుకోలేకపోయిన భార్య నిర్మ‌ల‌.. తనకు ఎలాగైనా తన కొడుకు కావాలని పట్టుబట్టింద‌ట‌. దాంతో అప్పటికే చేయించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌కు ప్రత్యామ్నాయ ఆపరేషన్ చేయించుకుని గర్భం దాల్చి అల్లు శిరీష్‌కి జన్మనిచ్చారు. ఇక శిరీష్ జన్మించిన త‌ర్వాత మ‌ళ్లీ రాజేషే పుట్టాడ‌ని మురిసిపోయార‌ట‌. ఈ నేప‌థ్యంలోనే అల్లు బాబీ, అల్లు అర్జున్‌ల కంటే శిరీష్‌నే అర‌వింద్ దంప‌తులు ఎంతో గారాభంగా పెంచార‌ట‌.