2021 ఇండియా హైఎస్ట్ గ్రాసర్ గా పుష్ప..!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప. అల్లు అర్జున్ తొలిసారిగా చేసిన పాన్ ఇండియా మూవీ ఇది. మొత్తం ఏడు భాషల్లో విడుదలకానున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. కరోనా కంట్రోల్ అయిన తరువాత అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మితమై విడుదల అవుతున్న సినిమా ఇది. తెలుగులో కూడా అఖండ వంటి పెద్ద సినిమా విడుదల అయినప్పటికీ.. పుష్ప దీని కంటే భారీ బడ్జెట్ లో నిర్మితమైంది. ఇక యువ స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ సినిమా మాత్రమే ఈ ఏడాది విడుదల అవుతోంది.

ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ అద్భుత రెస్పాన్స్ దక్కించుకున్నాయి. పుష్ప సినిమా దేశ వ్యాప్తంగా సుమారుగా మూడు వేల థియేటర్లలో విడుదలవుతోంది. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా మొదటి రోజే రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగులో ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో రావడం ఇక లాంఛనమే.

మలయాళంలో అల్లు అర్జున్ సూపర్ స్టార్ కాబట్టి.. అక్కడ కూడా అదిరిపోయే రెస్పాన్స్ రావడం పక్కాగా కనిపిస్తోంది. కన్నడ భాషలో తెలుగు అగ్రహీరోలకు ఉన్న మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిగిలి ఉంది తమిళ్, హిందీ భాషలు. పుష్ప సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కడం, ఆ మూవీ నేపథ్యం తమిళ సినిమాలకు దగ్గరగా ఉండటం, అల్లు అర్జున్ మేకోవర్ తమిళనాడు ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచింది. దీంతో అక్కడ కూడా భారీ ఓపెనింగ్స్ ఖాయమని అంటున్నారు.

బన్నీకి హిందీలో కూడా డబ్బింగ్ సినిమాలతో మంచి క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం అక్కడ థియేటర్లలో సరైన సినిమా కూడా లేకపోవడంతో పుష్ప కు మంచి వసూళ్లు రావొచ్చని అంటున్నారు. అన్ని భాషల్లో కలిపి పుష్ప రూ. 200 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్కు దాటడం సులభమేనని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది బాలీవుడ్ లో మూవీ విడుదలైన సూర్య వంశీ సుమారు రెండు వందల కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఆ మూవీ ని దాటి వెళ్లడం పుష్పకు పెద్ద కష్టం కాదని ప్రస్తుతం జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ చెబుతున్నాయి. పుష్ప సినిమాతో బన్నీ ఇండస్ట్రీ రికార్డు హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారు.