పదేపదే అభాసుపాలు.. జగన్ తీరు మారదా?

అమరావతి రాజధాని కేసులకు సంబంధించి రోజువారి విచారణలు ప్రారంభం అయ్యాయి. సీజే ప్రశాంత్ మిశ్రతో సహా మరో ఇద్దరు న్యాయమూర్తులు వాదనలు వింటున్నారు. తొలిరోజు అమరావతి రైతుల తరఫున వినిపించిన వాదనల్లో ‘మూడు రాజధానులు’ అనే ఆలోచనే మరచిపోవాలంటూ.. వారు విన్నవించడం జరిగింది. మొత్తానికి రోజువారీ విచారణల పర్వం మొదలైంది గనుక.. అమరావతి రాజధాని విషయంలో తొందరల్లోనే ఒక నిర్ణయం వస్తుందని.. అమరావతా? మూడు రాజధానులా? అనే విషయంలో కోర్టు పరంగా ఉన్న అడ్డంకి తొలగిపోతుందని అనుకోవచ్చు.

అయితే ఈ కేసు విచారణ సందర్భంగా మరో అంశం చాలా కీలకంగా పరిశీలించదగినది. త్రిసభ్య దర్మాసనంలో సీజే ప్రశాంత్ మిశ్ర మినహా మిగిలిన ఇద్దరు న్యాయమూర్తులు విచారణకు తగరని, వారు విచారణ నుంచి తప్పుకోవాలని రాష్ట్రప్రభుత్వం ఒక పిటిషన్ వేసింది. రాష్ట్రప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఈ మేరకు అనుబంధ పిటిషన్ వేశారు. దీనిపై ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే ఆన్ లైన్ లో వాదనలు వినిపించారు. ఈ పిటిషన్ ద్వారా.. జగన్ ప్రభుత్వం మరోసారి అభాసుపాలైంది.

ఇంతకీ సదరు అనుబంధ పిటిషన్ సారాంశం ఏమిటి? సీజే తప్ప మిగిలిన ఇద్దరు న్యాయమూర్తులకు అమరావతి ప్రాంతంలో ప్లాట్ల కేటాయింపు జరిగిందని, అందువలన వారు అమరావతికి అనుకూలంగా తమ నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉన్నదని.. దానిద్వారా వారికి ఆర్థిక ప్రయోజనం ఉన్నదని, కనుక వారిద్దరికీ విచారణార్హత లేదు అనేది జగన్ ప్రభుత్వపు వాదన. ఈ వాదనపై సీజే ప్రశాంత్ మిశ్ర చాలా సీరియస్ అయ్యారు. అప్పటి ప్రభుత్వం విధాన నిర్ణయంలో భాగంగా ప్లాట్లు కేటాయిస్తే.. దాన్ని ఆర్థిక ప్రయోజనంగా ఎలా పరగిణిస్తారంటూ ఆయన సీరియస్ అయ్యారు. ప్రభుత్వం జీతం ఇస్తోంది గనుక.. నేను కూడా విచారణ నుంచి తప్పుకోవాలా? అంటూ ఎదురు ప్రశ్నించారు. వారిద్దరినీ విచారణనుంచి తప్పించేది లేదని తేల్చి చెప్పారు. ఇది జగన్ ప్రభుత్వానికి విచారణ ప్రారంభ సమయంలోనే చాలా పెద్ద ఎదురుదెబ్బే లెక్క.

తీర్పు ఎలా రాబోతోందో ఒక అంచనాకు వచ్చే.. న్యాయమూర్తులకు వక్ర ఉద్దేశాలు ఉన్నట్లుగా ముందుగానే బురద చల్లడం అనేది, ఆపాదించడం అనేది జగన్ ప్రభుత్వపు తీరులాగా ముద్రపడింది. ప్రస్తుత సుప్రీం సీజే రమణ ఆ పదవిలోకి రాకుండా ఉండేలా.. ఆయనకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి అప్పటి సీజేకు లేఖ రాసి ఒకసారి అభాసు పాలయ్యారు. అమరావతి విషయంలో హైకోర్టు న్యాయమూర్తుల మీద వైసీపీ శ్రేణనులు అపరిమితంగా దుష్ప్రచారం సాగించి, బురద చల్లడం ద్వారా.. పార్టీని ప్రభుత్వాన్ని మరింత అభాసుపాలు చేశారు.

కేసుకు తమకు అననుకూలంగా తేలదేమో అనే అనుమానం రాగానే.. తీర్పు ఇచ్చే వారి నిజాయితీ మీద సందేహాలను రేకెత్తించేలా.. తీర్పుకు ముందుగానే ప్రచారం ప్రారంభించడం ఒక టెక్నిక్ అయింది. అదే తీరుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరఫున.. అమరావతి కేసులు విచారించే త్రిసభ్య ధర్మాసనంలోని ఇద్దరి మీద కూడా విచారణ నుంచి తప్పించాలనే పిటిషన్ పడింది. కానీ సీజే ప్రశాంత్ మిశ్ర దృఢంగా వ్యవహరించి తిరస్కరించడంతో.. ప్రభుత్వం మరోసారి అభాసుపాలు అయింది.