అసలు ’వరి‘ని కొనేదెవరు? ..ముందు ఇది తేల్చండి

తెలంగాణలో వరి రాజకీయం వేడెక్కింది. రైతులు పండించిన వరిని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంటే..కాదు.. కేంద్ర ప్రభుత్వమే ఆ పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి పట్టుపడుతోంది. దీంతో రాష్ట్రంలో వరి కొనుగోలు సంగతి పక్కకువెళ్లి టీఆర్ఎస్, బీజేపీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆందోళన చేస్తే.. శుక్రవారం టీఆర్ఎస్ కూడా నిరసన బాట పడుతోంది. ఒకవైపు రైతులు కొనుగోళ్లు లేక ప్రాణాలు కోల్పోతుంటే.. బాధ్యతగల ప్రభుత్వాలు, పార్టీలు మాత్రం తమ రాజకీయాల కోసం కాలం గడుపుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఇరు పార్టీలు రైతుకు భరోసా ఇవ్వడం లేదు. సీఎం కేసీఆర్ రెండు రోజుల పాటు గంటలతరబడి మీడియా సమావేశాల్లో మాట్లాడారు కానీ.. అన్నదాతకు మాత్రం హామీ ఇవ్వలేకపోయారు. ఎంతసేపూ.. ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేయడమే పనిగాపెట్టుకున్నారు. అధికార పార్టీ అయిన తరువాత అపోజిషన్ పార్టీని విమర్శించడం సహజమే.. అయితే దానితోపాటు రాత్రనక, పగలనక కష్టపడి పంట పండించిన రైతులకు ఊరటనిచ్చే ఒక్క మాట కూడా చెప్పలేకపోయారు. సరే.. కేంద్ర ప్రభుత్వం వరిని కొనుగోలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ కేంద్రం కొనుగోలు చేయలేకపోతే తామే కొంటామనే హామీ ఎందుకు ఇవ్వడం లేదని రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యపోతున్నారు. రైతుకు కష్టమొచ్చినప్పుడు ఆదుకోవాల్సింది ప్రభుత్వమే కదా అని పేర్కొంటున్నారు.

ఇక బీజేపీ వైఖరి కూడా విచిత్రంగా ఉంది. ఎంతసేపూ.. సర్కారును దుమ్మెత్తి పోయడమే తప్ప.. రైతుకు అనుకూలంగా మాట్లాడటం లేదు. అవును.. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు.. ఈ సర్కారే కొనాలి అని నిరసన చేయడంతోపాటు.. కేంద్రంతో మాట్లాడి కొనుగోలు చేయిస్తాం.. దిగులుపడకండి అని మాత్రం చెప్పడం లేదు. భవిష్యత్తులో తెలంగాణలో పాగా వేస్తామని చెప్పుకునే కమల నాయకులు రైతు సమస్యను మాత్రం రాజకీయంగానే చూస్తున్నారు తప్ప.. వారికి ఊరటనిచ్చే మాటలు మాత్రం చెప్పడం లేదు. ఏదేమైనా.. అదే రాజకీయం.

Share post:

Latest