ఈటల వింత వాదన

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది.. అక్కడ ఈటల రాజేందర్‌.. టీఆర్ఎస్‌ అభ్యర్థిపై గెలిచారు. అంతే.. ఈ చర్చ ఇపుడు ముగిసింది. ఈ ఎన్నికల ఫలితాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండు, మూడు రోజులు ఈ విషయాల గురించి మాట్లాడతారు. అంతే.. అయితే గురువారం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాత్రం వింత విషయాన్ని తెరపైకి తెచ్చారు. హుజూరాబాద్‌లో బీజేపీ గెలవడం.. అందులోనూ తాను విజయం సాధించడం జీర్ణించుకోలేని కేసీఆర్‌.. ఆ విషయాన్ని దృష్టి మరల్చడానికే రైతుల కోసం ధర్నా లాంటి కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. వినేందుకే వింతగా ఉన్న ఈ విషయాన్ని.. రాజకీయాల్లో సూపర్‌ సీనియర్‌ అయిన ఈటల రాజేందర్‌ ఇలా ఎలా మాట్లాడతారని రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్రంలో వరి కొనుగోలు సమస్య నెలకొంది.. కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని టీఆర్ఎస్‌, కాదు రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని బీజేపీలు వాదులాడుకుంటున్నాయి. సమస్య రైతులదైనా పార్టీలు మాత్రం..తామే రైతులకు అండగా ఉంటున్నామని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నాయి. వరిని కేంద్రం కొనుగోలు చేస్తుందా? చేయదా? అని సీఎం కేసీఆర్‌ సూటిగా..స్పష్టంగా అడుగుతున్నారు.అంత స్పష్టత ఉన్నపుడు హుజూరాబాద ఓటమిని దృష్టిమరల్చేందుకే అంటున్నారు ఈటల. అలా ఆయనకు ఎందుకు అనిపించిందో. వరి కొనుగోలుకు సంబంధించి బీజేపీ నాయకులు మాత్రం సమాధానం చెప్పడం లేదు. రైతుల వద్దకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తారు గానీ.. కేంద్రం ఏమనుకుంటుందో మాత్రం నోరెత్తడం లేదు. రాబోయే రోజుల్లో సమస్య మరింత తీవ్రం కానుంది. రైతులు మరింత ఇబ్బండి పడే ప్రమాదముంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గానీ, రాష్ట్రంలో పవర్‌ ఉన్న టీఆర్ఎస్‌ గానీ ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే అన్నదాతకు ఇబ్బందే..దీనిని బట్టే రాబోయే ఎన్నికల ఫలితాలు కూడా ఉంటాయనడంలో సందేహం లేదు.