నా కన్నీళ్లను ఢిల్లీలో చెప్పండి.. ఎంపీలకు బాబు హుకుం

పార్లమెంటు సమావేశాలు మొదలు కాబోతున్న నేపథ్యంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తన పార్టీకి చెందిన ఎంపీలతో ఒక సమావేశం నిర్వహించారు. పార్లమెంటులో ఏయే అంశాలపై మాట్లాడాలో ఆయన వారికి సూచనలు చేశారు. ఇది ప్రతిసారీ జరిగే తంతే. సాధారణంగా ఢిల్లీ పాలనకు సంబంధించిన అంశాలే ఎక్కువగా ఈ సూచనలుగా వస్తుంటాయి. అయితే ఈసారి చంద్రబాబు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు అన్నీ.. పార్లముంటలో చెప్పాలని సూచించినట్లు తెలుస్తోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. వార్తల్లో వెలుగులోకి రాకుండా.. ఎంపీలకు ఆయన చేసిన మరొక ముఖ్యమైన సూచన కూడా ఉంది. అదే.. తన కన్నీళ్లను గురించి.. పార్లమెంటులో ప్రస్తావించాలని చెప్పడం.
తన భార్యను సభలో అవమానించారనే మాట చెబుతూ.. చంద్రబాబు వెక్కి వెక్కి ఏడుస్తూ.. ప్రజల ముందు వాపోయారు. తన భార్యను అన్నారని.. తాను శానసభలో అడుగుపెట్టనని ప్రతిజ్ఞ చేశారు. సీఎం అయితే తప్ప మళ్లీ సభకు రానని కూడా అన్నారు. అక్కడినుంచి ఆయనకు ఒకఅద్భుతమైన అస్త్రం అంది వచ్చింది. ఆరోజు నుంచి ఇవాళ్టిదాకా ప్రజల నుద్దేశించి గానీ.. మీడియాను ఉద్దేశించి గానీ ఎక్కడ మాట్లాడాల్సి వచ్చినా.. ఆయన తన కన్నీళ్లను తన భార్య మీద వేసిన నిందలను ప్రస్తావిస్తున్నారు.
తన భార్య ను రచ్చకీడ్చిన వైనం మరింత రాజకీయ ప్రయోజనంగా మార్చుకునేందుకు.. ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఈ రాద్ధాంతాన్ని కంటిన్యూ చేయడానికి మహిళల ఆత్మగౌరవ సభలు కూడా నిర్వహిస్తున్నారు.

ఇవన్నీచాలవన్నట్టుగా.. తన కన్నీళ్లను ఢిల్లీ సభలో వినిపించాలనే ఆయన ఆరాటం ఎంపీల మీద రుద్దుతున్నారు. వైసీపీ సర్కారు మహిళల పట్ల ఇలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, ఇది శాంతి భద్రతల సమస్య అని ఢిల్లీలో రాద్ధాంతం చేయాలని ఆయన చెప్పినట్టుగా సమాచారం. సరిగ్గా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలోనే.. రాష్ట్రంలో బాబు ప్లాన్ చేసిన ఆత్మగౌరవ సభలు కూడా మొదలవుతాయి. ప్రభుత్వం నుంచి ఏ చిన్న అడ్డంకి వచ్చినాసరే.. దానిని పెద్దది చేసి.. ఢిల్లీలో రాద్ధాంతం చేయాలనేది వారి స్కెచ్ గా కనిపిస్తోంది.

భార్యను ఏమైనా అన్నారనేది చంద్రబాబునాయుడు వ్యక్తిగత వ్యవహారం. అయితే దీనినుంచి ఆయన రాజకీయ ప్రయోజనం పొందాలని అనుకుంటున్నారని, భార్యను ఆయనే పదేపదే రచ్చకీడుస్తున్నారని, తాము అన్నదేమీ లేదని వైసీపీ నేతలు పదేపదే చెబుతున్నారు. చంద్రబాబు ఢిల్లీ పార్లమెంట్ స్కెచ్, అక్కడ రగడ చేసే ఆలోచన గమనిస్తే అది నిజమే అనిపిస్తోంది.