’బండి‘కి బ్రేకులు వేయలేకపోతున్న ’కారు‘

భారతీయ జనతా పార్టీ.. ఎప్పుడూ ఉత్తర భారతదేశంలోనే దీని హవా.. దక్షిణాదిలో కేవలం కర్ణాటకలో మాత్రమే.. ఇది గతం.. ఇప్పుడు సౌత్ లో తెలంగాణలో దూసుకుపోతోంది. ఎప్పుడూ మూడో స్థానంలో ఉండే బీజేపీ ఇపుడు అధికార పార్టీకి ఏకుమేకై కూర్చుంది. గతంలో అధికార పార్టీ తరువాత కాంగ్రెస్ మాటలు వినిపించేవి. ఇపుడు బీజేపీకి ఆ అవకాశం దక్కింది. అందుకు నిదర్శనమే సీఎం కేసీఆర్ మీడియా సమావేశం. రాష్ట్రంలో ఉన్నది కేవలం తమ పార్టీనేనని గొప్పలు చెప్పుకునే కేసీఆర్ ఇపుడు బీజేపీకి, ఆ పార్టీ కార్యక్రమాలకు షాక్ కు గురవుతున్నారు. ఎప్పుడూ ఎవరి గురించి మాట్లాడని సీఎం బీజేపీ గురించి మాట్లాడుతున్నారు. అరె.. బీజేపీ ఏంది.. మన వద్ద అధికారంలోకి ఏంది? అని గతంలో అనేకసార్లు కారు పార్టీ నాయకులు అనుకున్న సందర్భాలున్నాయి. బళ్లు ఓడలు.. ఓడలు బళ్లు ఇక్కడ కాలేదు కానీ ఆ పరిస్థితి వస్తోందా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.

’బండి‘ సూపర్ స్పీడ్..

బీజేపీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్ తనకు అప్పగించిన బాధ్యతలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. గతంలో పనిచేసిన రాష్ట్ర అధ్యక్షుల కంటే అగ్రెసివ్ గా మాట్లాడుతున్నారు. నేరుగా సీఎం, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసి కామెంట్ చేస్తుండటంతో టీఆర్ఎస్ పార్టీకి మింగుడు పడటం లేదు. బండి ఎప్పుడు..ఎక్కడ మాట్లాడినా అవినీతి గురించే.. సీఎం కుటుంబం భారీ అవినీతికి పాల్పడిందని, ప్రాజెక్టుల నిర్మాణాలు, భూముల వేలంలో వేల కోట్ల రూపాయలు వారి జేబులోకి వెళ్లాయని ఆరోపిస్తున్నారు. ఆయన మాటలు నేరుగా జనంలోకి వెళుతున్నాయి. దీంతో కారు పార్టీ నాయకులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. బండి టీ.చీఫ్ అయిన తరువాత బీజేపీ గ్రాఫ్ తెలంగాణలో అమాంతం పెరిగిందనే చెప్పవచ్చు. అసెంబ్లీలో కేవలం ఒక్కరికే పరిమితమైన పార్టీ ఇప్పుడు ముగ్గురి వరకు వచ్చింది. తరువాత అధికార స్థానం వరకు వస్తామని బండి కచ్చితంగా చెబుతున్నారు.

కేసీఆర్ కు షాక్ మీద షాక్

మొన్న దుబ్బాక ఉప ఎన్నికలు.. నిన్న జీహెచ్ఎంసీ ఎన్నికలు.. నేడు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కమలం పార్టీ కారు పార్టీకి షాక్ ఇచ్చింది. దీంతో కేసీఆర్ కు రాష్ట్రంలో ఏం జరుగుతోందో అర్థం కాలేదు. అంతలోనే వరి కొనుగోళ్ల సమస్య వచ్చింది. బీజేపీ నాయకులు రాష్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తుంటే.. కాదు కేంద్రమే కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ చెబుతోంది. వరి వ్యవహారం ఇరు పార్టీల మధ్య వార్ నడిపిస్తోంది. ఎప్పుడూ బీజేపీని ప్రత్యర్థిగా చూడని కేసీఆర్ ..ఇపుడు ఏకంగా ఆ పార్టీ తీరు, బండి సంజయ్ వ్యవహారంపై ఏకంగా ధర్నా చేస్తున్నారనంటే బండి ఎంత సక్సస్ అయ్యారో అర్థమవుతోంది. రెండు రోజులుగా బండి సంజయ్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఆ పర్యటనలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగుతున్నారు. ఇంత పరిస్థితి తెచ్చింది ఎవరనేది అందరికీ తెలిసిందేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

హైకమాండ్ హ్యాపీ..

తెలంగాణలో బీజేపీ నాయకులు, వారి పనితీరుపై ఢిల్లీ పెద్దలు హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో పెద్దగా కార్యకలాపాలు లేకపోయినా ఇక్కడ మాత్రం అధికార పార్టీని ముప్పు తిప్పలు పెడుతోంది. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో అధికారం మనదే అని.. నాయకులందరూ బండి సంజయ్ కు సహకరించి తీరాల్సిందేనని అంతర్గతంగా ఆదేశించినట్లు సమాచారం.