హుజూరాబాద్ ఎన్నికల్లో నలుగురు రాజేందర్లు?

అవును మీరు చదివింది నిజమే.. ఈనెల 30న జరిగే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నలుగురు రాజేందర్లు పోటీచేస్తున్నారు. అదేంది ఉన్నది ఒక్క రాజేందరే కదా అనే అనుమానం రావడం సహజం. వారందరూ రాజేందర్లే అయినా.. అందరూ ఈటల రాజేందర్లు కాదు.. కాబట్టి పెద్ద టెన్షనేం అవసరం లేదు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. ఇది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈటల బీజేపీలో చేరడంతో రాజకీయం మరింత వేడెక్కింది. టీఆర్ఎస్, బీజేపీ నాయకులు పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నారు. నోటిఫికేషన్ రావడం.. నామినేషన్లు దాఖలు చేయడం కూడా జరిగిపోయాయి.

నామినేషన్ దాఖలుకు నిన్ననే గడువు ముగిసింది. గడువు ముగిసిన తరువాత వాటిని పరిశీలిస్తే.. రాజేందర్ పేరు కలిగిన అభ్యర్థులు నలుగురు నామినేషన్ వేశారు. అదికూడా ఇంటిపేరు E అని ఉన్నవాళ్లే నామినేషన్ ఫైల్ చేశారు. వారెవరెవరంటే.. ఆల్రెడీ ఈటల రాజేందర్ (బీజేపీ) ఉన్నాడు. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున ఇమ్మడి రాజేందర్, న్యూ ఇండియా పార్టీ తరపున ఈసంపల్లి రాజేందర్, ఆలిండియా బీసీ ఓబీసీ పార్టీ తరపున ఇప్పలపల్లి రాజేందర్ తమ నామినేషన్లు ఆఖరిరోజు దాఖలు చేశారు. ఎందుకు దాఖలు చేశారు అంటే పొలిటికల్ గేమ్ అని మనకు తెలుస్తూనే ఉంది. మరి చివరకు వీరంతా బరిలో ఉంటారో, లేక నామినేషన్లు ఉపసంహరించుకుంటారో వేచి చూడాలి. ఈటల రాజేందర్ ను ఎన్నికల్లో దెబ్బ కొట్టేందుకు తలపండిన రాజకీయ నాయకులు ఆడుతున్న గేమ్ అని పరిశీలకులు భావిస్తున్నారు.