చిరంజీవి లైనప్ లో మరో రీమేక్.. అసలు విషయం ఇదే..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య తో పాటు గాడ్ ఫాదర్, భోళాశంకర్ సినిమాలు చేస్తున్నాడు. ఆచార్య సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా మిగిలిన రెండు సినిమాలు రీమేక్ లే. అందులో ఒకటి మలయాళంలో సూపర్ హిట్టయిన లూసిఫర్ ఆధారంగా గాడ్ ఫాదర్ సినిమాను తెరకెక్కిస్తుండగా.. దీనికి తమిళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే తమిళంలో అజిత్ హీరోగా నటించిన వేదాళం సినిమాను మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ పేరుతో చిరంజీవి రీమేక్ చేస్తున్నాడు.

ప్రస్తుతం మలయాళంలో లూసిఫర్ సినిమా కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనుంది. ఇది లూసిఫర్ కు కొనసాగింపుగా చేస్తున్నారు. పృథ్వీ రాజ్ చౌహానే దీనికి కూడా దర్శకుడు. మోహన్ లాల్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. లూసిఫర్ సినిమా క్లైమాక్స్ లో మోహన్ లాల్ ఒరిజినల్ క్యారెక్టర్ రివీల్ చేస్తారు. మోహన్ లాల్ ముందు నేపథ్యం ఏమిటి..తన అనుచరుడైన పృథ్వీ రాజ్ తో అతనికి పరిచయం ఎలా జరిగింది.. అతడెలా మోహన్ లాల్ కు అంగరక్షకుడిగా మారాడు.. అనే కోణంలో ఈ కథ ఉండబోతున్న ట్లు తెలుస్తోంది.

అంటే లూసిఫర్ సినిమాకు సీక్వెల్ గా కాకుండా ప్రీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం లూసిఫర్ రీమేక్ చేస్తున్న చిరంజీవి.. ఆ తర్వాత లూసిఫర్ ప్రీక్వెల్ మలయాళం లో విడుదలై విజయం సాధిస్తే తెలుగులో చిరంజీవి కూడా చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమా డిసెంబర్లో క్రిస్మస్ కానుకగా 17న విడుదల కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.