ఆ పుస్తకంలో ’అమరావతి‘ ఇక కనిపించదు

ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తరువాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం రాజధానిగా విజయవాడ వద్ద అమరావతి పేరిట కొత్త రాజధానిని నిర్మించాలని నిర్ణయించింది. అప్పటి సీఎం చంద్రబాబు కూడా అందుకు తీవ్రంగా కసరత్తు చేశారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి ఈ విషయాలన్నీ విద్యార్థులకు తెలియాలి కదా అనే భావనతో టెన్త్ క్లాస్ విద్యార్థుల పాఠ్యాంశాల్లో చేర్పించారు. పదవ తరగతి తెలుగు పుస్తకోం అమరావతి అనే పాఠం ఉంటుంది. ఇది గతం.. అయితే ఈ సంవత్సరం మాత్రం ఈ పాఠాన్ని విద్యార్థులు చదవలేరు. ఎందుకంటే ఆ లెసన్ ను ప్రస్తుత ప్రభుత్వం తొలగించింది. కొత్తగా ముద్రించిన పుస్తకాల్లో అమరావతి లేకుండా టెన్త్ తెలుగు పుస్తకాలు వచ్చేశాయి.

దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు అగ్రహోదగ్రులయ్యారు. పాఠ్యాంశంగా ఉన్న అమరావతి గురించి విద్యార్థులకు చెప్పకపోతే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. పాఠశాలల్లో కూడా రాజకీయాలు చేస్తారా అని విమర్శిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అనగాని నాని ఓ అడుగు ముందుకేసి.. బాబాయ్ గొడ్డలిపోటు.. షర్మిల కన్నీటి గాథలు అనే అంశాలను పాఠ్యపుస్తకాల్లో చేర్చండి అని ఎద్దేవా చేశారు. ఇక సీపీఐ, బహుజన జేఏసీ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలన్నీ పక్కనపెట్టి అమరావతిని లెసన్ గా చేర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ కూడా డిమాండ్ చేశారు. ఎవరెన్ని చేసినా.. ఎంత మొత్తుకున్నా జగన్ అనుకున్నది అనుకున్నట్లు చేస్తాడనేది అందరికీ తెలిసిందే. అంటే అమరావతి పాఠం ఇక 10వ తరగతి పుస్తకాల్లో కనిపించదంతే..