ఓటు కోసం నోటు.. మా ఎన్నికల్లోను అదే ఫార్ములా?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మా ఎన్నికలు అక్టోబర్ 10 న జరుగనున్న విషయం అందరికి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి మా ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. అంతేకాకుండా రాజకీయ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. అయితే నేటి నుంచి నామినేషన్ లను స్వీకరిస్తున్నారు. ఇప్పటికే పలువురు విందులు ఇచ్చి ఓటర్లను మచ్చిక చేసుకునే కార్యక్రమాలను మొదలు పెట్టగా.. తాజాగా ఓటుకు నోటు అనే టాపిక్ టాలీవుడ్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఓటుకు భారీగా ఇచ్చి కొనుగోలు చేస్తున్నారంటూ ఇండస్ట్రీలో గట్టిగా టాక్ వినిపిస్తోంది.

ప్రకాష్ రాజ్ ప్యానల్ తగ్గట్టుగానే మంచు విష్ణు ప్యానల్ కూడా ఎక్కడా తగ్గకుండా అదేరీతిలో దూసుకుపోతోంది. ఏ చిన్న అవకాశం వచ్చినా వారు వదులుకోవడం లేదు అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో ఈసారి మా ఎన్నికలు సాధారణంగా అయితే జరగవు అని సినీ విశ్లేషకులు అంటున్నారు. అయితే సినీ ఇండస్ట్రీలో చాలా వరకు డబ్బు పరపతి ఉన్న వాళ్ళే కాగా ఒక వర్గానికి మాత్రమే విపరీతమైన డబ్బు పంపిణీ జరుగుతోందట. అంతేకాకుండా హైదరాబాద్ నగరంలో లేని ఆర్టిస్టులను కూడా కాంటాక్ట్ అవుతున్నారని తెలుస్తోంది. వారిని ఆపదలో ఆదుకునే రామని, అంతేకాకుండా ఎన్నికల సమయానికి అందుబాటులో ఉండటానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారట. దీంతో అక్టోబర్ 10 న వచ్చే ఫలితాలు ఒకవైపు గానే వస్తాయి అనడానికి అవకాశం లేదనే మాట ఎక్కువగా వినిపిస్తోంది.