హత్య లేకుండా.. అత్యాచారమైతే లైట్ తీస్కో!

September 17, 2021 at 11:14 am

పోలీసులు చట్టాన్ని అతిక్రమించలేరు. ఎంత ఆవేశం ఉన్నప్పటికీ చట్టం పరిధికి లోబడి మాత్రమే వారు పనిచేయాల్సి ఉంటుంది. ఇదంతా నిజమే గానీ.. కొన్ని సందర్భాల్లో వారు తీసుకునే నిర్ణయాలు, అనుసరిస్తున్న పద్ధతులు గమనిస్తే చిత్రంగా కనిపిస్తుంటుంది. హత్యాచారం అయితేనే అంటే అత్యాచారంతో పాటు హత్య కూడా చేస్తేనే సీరియస్ గా తీసుకుంటారా? కేవలం అత్యాచారం మాత్రమే అయితే లైట్ తీసుకుంటారా? అనే అభిప్రాయాలు కలుగుతున్నాయి.

సైదాబాద్ దుర్ఘటన ఒక పెద్ద ఉదాహరణ. ఆరేళ్ల బాలికపై హత్యాచారం జరిగింది. రాజు అనే నిందితుడిని గుర్తించి.. అతడిని అరెస్టు చేయడానికి పోలీసులు అన్నివైపులా ఉచ్చు పన్నారు. అతడిని పట్టిచ్చిన వారికి పది లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించారు. మొత్తానికి రాజు చుట్టూ బీభత్సంగా ఉచ్చు బిగిసింది. నిజానికి పరారీలో ఉన్న నిందితుడు కూడా భయపడిపోయాడు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. శరీరం గుర్తు పట్టలేని విధంగా నుజ్జయింది. చేతి మీద పచ్చబొట్టు కారణంగా.. అతను నిందితుడు రాజు అని గుర్తించారు. ఒక నేరానికి పాల్పడిన వాడి జీవితం అలా ముగిసిపోయింది.
ఒకవేళ రాజు పోలీసులకు దొరికి ఉన్నా సరే.. ఏమై ఉండేది. ఇటీవలి దష్టాంతాలతో పోల్చి చూసుకుంటే.. ఎన్ కౌంటర్ చేసి ఉండేవారేమో అని ఎవరికైనా అనిపిస్తుంది. నేరం చేసిన రాజుకు కూడా అదే భయం కలిగి ఉండొచ్చు. అదే భయంతో తన జీవితాన్ని తానే కడతేర్చుకున్నాడు.
కానీ రాజు జీవితం కడతేరిపోయేలోగా.. మరో అదే తరహా దుర్ఘటన జరిగింది. జగిత్యాల జిల్లాలో ఓ ఇంటర్మీడియట్ కుర్రాడు, సైదాబాద్ దుర్ఘటన గుర్తుకు వచ్చే తరహాలోనే.. ఆరేళ్ల బాలికమీద అత్యాచారానికి పాల్పడ్డాడు. తేడా ఏంటంటే.. ఆ పసిపాపను చంపలేదు. అతను పోలీసుల చేజిక్కాడు. పోలీసులు ఎలాంటి చర్య తీసుకుంటారనే క్లారిటీ ఇంకా లేదు.

ఒకవైపు రాజు చేసిన దుర్మార్గానికి సంబంధించి విస్తృతంగా ప్రచారం జరిగినా.. అతడిని పట్టిస్తే పదిలక్షల రూపాయల రివార్డు ఇస్తారనే పోలీసు ప్రకటన గురించి తెలిసినా.. మరో ఇంటర్మీడియట్ విద్యార్థి అలాంటి దురాగతానికి ఎలా పాల్పడ్డాడు. బహుశా.. తాను అత్యాచారం చేసిన పసిపాపను చంపడం లేదు గనుక.. ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదని అనుకున్నాడో ఏమో తెలియదు.
పోలీసులు పట్టుకోవడం, ఆ తర్వాత చట్టాలు అమలుకావడమూ ఇదంతా పూర్తయ్యేసరికి చాలా కాలం పడుతుందనే ధీమా కూడా ఉండవచ్చు. ఎందుకంటే జగిత్యాల దురాగతానికి పాల్పడిన వాడు అమాయకుడు, అజ్ఞాని, కేవలం కామాంధత్వం తప్ప ప్రాపంచిక జ్ఞానం లేని వాడు కాదు. ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడే ధైర్యం కలిగిందంటేనే.. మన వ్యవస్థ గురించి వారికి ఎలాంటి అభిప్రాయం ఉందా అనే అనుమానం కలుగుతోంది.
అత్యాచారం తో పాటు హత్య కూడా ఉన్నదా లేదా అనే దానితో సంబంధం లేకుండా.. తప్పు చేసిన వారికి కఠిన శిక్షలు పడేలా, తప్పులు చేయాలంటే భయం పుట్టేలా చట్టం వ్యవహరించినప్పుడే ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ పునరావృతం కాకుండా ఉంటాయి.

హత్య లేకుండా.. అత్యాచారమైతే లైట్ తీస్కో!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts