’కడియం‘ మాటలు వినిపించాయా సారూ..!

దళితబంధును అమలు చేయకపోతే నష్టపోయేది పార్టీనే అని కుండబద్దలు కొట్టినట్లు ఆ పార్టీ సీనియర్ నేత కడియం శ్రీహరి చెప్పిన మాటలు ఇపుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. అరె.. ఆయన ఇదేంది ఇలా మాట్లాడుతున్నారు అని పలువురు నాయకులు కూడా ఆశ్చర్యపోయారు. ఇటీవల కాలంలో సైలెంట్ గా ఉన్న కడియం ఉన్నట్టుండి పొలిటికల్ సీన్ లోకి ఎవరూ ఊహించని విధంగా ఎంటర్ ఇచ్చారు.

జగనాంలో జరిగిన సమావేశంలో దళితబంధు పథకం అమలుపై నిర్మొహమాటంగా తన అభిప్రాయం చెప్పారు. తాము సింహంపై స్వారీ చేస్తున్నామని తెలుసని, పడిపోతే నష్టం జరిగేది కూడా తెలుసని చెప్పారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు అమలు చేయాలని పరోక్షంగా చెప్పినట్లే. అంతేకాక మరో అడుగువేసి ఈ పథకం పూర్తిగా అమలు చేయడానికి 5,6 సంవత్సరాలు పడుతుందని కూడా చెప్పారు. అంటే.. ఇప్పటికిప్పుడే రాష్ట్రంలో దళితబంధు అమలు చేసేందుకు అవకాశం లేదని, దశల వారీగా అమలు చేస్తారని పేర్కొన్నారు. 2023లో ఎన్నికలు వస్తాయి.. కనీసం అప్పటిలోగా కూడా పథకం పూర్తిచేయకపోవచ్చని వివరించారు. కడియం మాటలు నేరుగా సీఎంను తాకేలా.. ఆయనకు చురక తగిలేలా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆయన ఏం చెప్పినా.. చెప్పిన విషయం మాత్రం వాస్తవమని, పథకం అమలులో నిర్లక్ష్యం వహించినా, పూర్తిగా అమలు చేయకపోయినా టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఘోరంగా దెబ్బతింటుందనేది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. మరి కడియం చేసిన కామెంట్స్ సీఎం కేసీఆర్ చెవిన పడ్డాయో.. లేదో మరి.