పట్టుకోసమే పెద్దారెడ్డి పోరాటం.. పట్టువదలని విక్రమార్కుడిలా జేసీపీ

అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయం రసకందాయంలో పడింది. తాడిప్రతి ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉండగా మున్సిపల్ చైర్మెన్ గా ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. అసలు విషయమేమంటే.. రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉండి కూడా తాడిపత్రి మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకోలేకపోయింది. ఇది ఎమ్మెల్యే కేతిరెడ్డికి ఇబ్బంది కరమే. అందుకే మున్సిపాలిటీ వ్యవహారాల్లో ఆయన తలదూరుస్తూ ఉంటాడు. అధికారులను కూడా గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇందుకు నిదర్శనమే చైర్మెన్ సమావేశం ఏర్పాటు చేసినా అధికారులు ఎమ్మెల్యే చేసిన సమీక్షకు హాజరు కావడం. ఇదే జేసీకి ఆగ్రహం తెప్పించింది. 

ఈ ఎపిసోడ్ లో ఇంత జరిగినా అధికారులు కూడా పెద్దగా స్పందించలేదు. టేక్ ఇట్ ఈజీగానే వ్యవహరిస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఒకరు ఎమ్మెల్యేగా, మరొకరు మున్సిపల్ చైర్మెన్ గా ఉంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఎవరూ.. ఎవరికీ తగ్గరు. ఢీ. అంటే ఢీ అంటారు. ఎంత అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా.. అవతల ఉన్నది జేసీ బ్రదర్.. కాబట్టి ఆయన కూడా నేనింతే అన్నట్లుంటాడు.  అసెంబ్లీ ఎన్నికలకు పెద్ద దూరమేమీ లేదు. తాడిపత్రిలో వైసీపీ జెండా ఎగరేయాలి అంటే మున్సిపాలిటీ అధికార పార్టీ పక్షాన ఉండాలి. అది ఇప్పట్లో సాధ్యం కాదు. టీడీపీ పరిస్థితి ఎలా ఉన్నా చైర్మెన్ మాత్రం రాజకీయంగా ఉద్ధండుడే.. ఢీకొనాలంటే అంత ఈజీ కాదు.. ఎలా అయిన పట్టుకోసం పెద్దారెడ్డి.. పరువు కోసం జేసీపీ బలాబలాలు చూపించుకుంటున్నారు.