కేసీఆర్ సార్.. ఇదేం విచిత్రం

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావుది  నేనింతే అన్నట్టుంది వ్యవహారం. నేను అనుకున్నది చేస్తా.. నాకు నచ్చినట్టు చేస్తా.. నచ్చకపోతే అంతే.. అని ఆయన చెప్పకపోయినా..చేస్తున్న పనులు మాత్రం నా ఇష్టం అన్నట్లుంది. దీనికి ఉదాహరణ ఎమ్మెల్యే కోటాలో జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికలే.. ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలు చెప్పాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే.. ప్రస్తుతం కరోనా కేసులు రోజు రోజుకూ ఎక్కువవుతున్నాయి. . ఈ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తే ఇబ్బందులు వస్తాయి అని సమాధానం చెప్పారు. ఎన్నికల సంఘం కూడా నిజమేనేమో అని అనుకుంది. మరి హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు ప్రయోగాత్మకంగా అమలు చేస్తాం అని చెప్పారు.

మంచిదే.. ఎవరూ కాదనరు.. ఈనెల 16న ప్రారంభించేందుకు లక్ష మందితో సభ ఏర్పాటు చేస్తారట.. ఇదేం విడ్డూరం.. అసలే కరోనా కాలంలో ఓ అకార్యక్రమాన్ని ప్రారంభించడానికి లక్ష మంది అవసరమా.. ఎవరైనా ప్రశ్నిస్తే ఏం.. తప్పా..? అని అంటారు. ఇక్కడ తప్పు, ఒప్పులది కాదు సమస్య.  కనీసం ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా నిర్వహించలేమని చెబుతున్న ప్రభుత్వం ఇంతమందితో ఎలా కార్యక్రమం నిర్వహిస్తారు? ఒకవేళ కరోనా సోకితే.. కేసులు ఎక్కువైతే ఎవరిది బాధ్యత? ప్రభుత్వం తీసుకుంటుందా? కేసీఆర్ తీసుకుంటారా? దలిత బంధు కార్యక్రమం హుజూరాబాద్ లోనే నిర్వహించుకోవచ్చు.. దానికి అడ్డు ఎవరూ చెప్పరు. అధికారులు, లబ్ధిదారులు, ముఖ్య నాయకులు.. ఇలా నిరాడంబరంగా జరుపుకోవచ్చు కదా..? దీనికి ఒప్పుకోరు. అంటే పెద్దగా ప్రచారం రాదు.. జనం రారు.. మీడియా పట్టించుకోదు.. కాబట్టి హంగామా చేస్తే రాష్ట్రం మొత్తం హుజూరాబాద్ వైపే చూస్తుంది. లక్ష మందితో సభ అంటే అనధికారికంగా ఎన్నికల సభ నిర్వహించినట్లే. అధికారులు కూడా సీఎం ఏం చెబితే అదే.. అంటారు.. అంతే..