శర్వానంద్-సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `మహాసముద్రం`. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మించారు. అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తుండగా.. జగపతి బాబు, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 14న విడుదల కాబోతోంది. ఈ విషయంపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దక్కించుకుందట.
అది కూడా ఏకంగా రూ. 10.5 కోట్లకు హాట్‌స్టార్ మహా సముద్రం డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేశారని తెలుస్తోంది. కాగా, చిన్నప్పటి నుంచి ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకున్న ఇద్దరు ఆవేశపరుల కథే మహాసముద్రమని సమాచారం. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.