సినీ ఇండ్రస్టీలో మరో విషాదం నెలకొంది. పలు దక్షిణాది చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసు దోచుకున్న సీనియర్ నటి జయంతి కన్నుమూశారు. ఈమె వయసు 76 సంవత్సరాలు. పలు అనారోగ్య సమస్యలతో ఇటీవల బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అడ్మిట్ అయిన జయంతి.. అక్కడే వెంటిలేటర్‌పై చికిత్స తీసుకున్నారు.
అయినప్పటికీ, ఆరోగ్యం విషమిస్తూ ఉండటంతో ఆదివారం రాత్రి జయంతి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె తనయుడు కృష్ణకుమార్ అధికారికంగా ధృవీకరించారు. దాంతో పలువురు సినీ ప్రముఖులు ఆమె మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా, జయంతి అసలు పేరు కమల కుమారి.
శ్రీకాళహస్తిలో పుట్టి పెరిగిన ఈమె భార్య భర్తలు అనే తెలుగు సినిమాతో కెరీర్‌ను స్టార్ట్ చేసింది. ఆ తర్వాత తెలుగులోనే కాకుండా.. కన్నడ, తమిళ, మళయాల, హిందీ భాషలలో సుమారు 500 సినిమాల్లో నటించారు. ముఖ్యంగా కన్నడ మెగా హీరో రాజ్ కుమార్‌తోనే ఈమె ఏకంగా 30 సినిమాల్లో నటించి.. అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం నుంచి రెండుసార్లు ఉత్తమ నటిగా, అలాగే రాష్ట్రపతి అవార్డు, రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఆమెను వరించాయి.