నిజంగానే ప్రత్యేక హోదాపై పోరాటమా.. లేక రాజకీయ నాటకమా..?

రాజ్యసభలో వైసీపీ సభ్యుల ప్రత్యేక హోదా పోరాటం నిజమేనా.. లేక అది రాజకీయ నాటకమా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరి పోరాటం ఎప్పుడో ఒకసారి వచ్చిపోయే అతిథిలా ఉందంటున్నారు విమర్శకులు. ఏపీకి ప్రత్యేక హోదా పోరాటం వల్లే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చింది. అధికారం ఇవ్వండి.. ఢిల్లీలో పోరాడతా అంటూ జగన్ పదే పదే చెప్పడంతో జనం అవకాశమిచ్చారు.

అయితే బీజేపీకి జాతీయస్థాయిలో మెజారిటీ రావడంతో జగన్ సైలెంట్ అయిపోయాడు. వాళ్లకు మెజారిటీ వచ్చింది.. ఇంక మేమేం చేయగలం అన్నట్లు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత చేయలేమంటూ కుండబద్దలుకొట్టేశాడు. అప్పుడప్పుడూ కేంద్రంలోని బీజేపీ పెద్దలకు హోదా గురించి కేవలం ఉత్తరాలు మాత్రమే ఇవ్వడం లాంటివి చేస్తున్నారు. అధికార పార్టీనే కాకుండా జనం కూడా దీనిని మరచిపోయారు.

అయితే మంగళవారం రాజ్యసభలో వైసీపీ సభ్యులు హోదాను గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఏపీకి ఇవ్వాల్సిందే అంటూ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు ఇచ్చారు. అంటే.. మేం ఇంకా హోదాను మరచిపోలేదు.. పోరాడుతున్నామంటూ జనానికి చెప్పడానికే తప్ప ఇందులో సీరియస్ నెస్ ఎక్కడా కనిపించలేదు. నిజంగా హోదాపై పోరాడాలంటే ఇన్ని రోజులు సైలెంటుగా ఎందుకుంటారు? ఆ పార్టీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు ఎన్నిసార్లు పోరాడారు? ఎన్ని వినతిపత్రాలు ఇచ్చారు? ఈ ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే..