ఏపీలో ఓ ఎంపీ సీటుకు జరుగుతోన్న రాజకీయం ఇప్పుడు యమా హాటుగా మారింది. అధికార టీడీపీ, విపక్ష వైసీపీ, కొత్తగా పోటీ చేస్తోన్న జనసేన ఈ మూడు పార్టీల నుంచి ఆ ఎంపీ సీటుకు కీలకమైన అభ్యర్థులు రంగంలో ఉంటారన్న ప్రచారం ఇప్పుడు అక్కడ పొలిటికల్ వాతావారణాన్ని ఎన్నికలకు రెండేళ్ల ముందే హీటెక్కించేస్తోంది. ప్రస్తుతం అక్కడ టీడీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్‌కు బదులుగా వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచి టీడీపీ తరపున చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి బరిలో ఉంటారని గత ఆరేడు నెలలుగా వార్తలు వస్తున్నాయి. జయదేవ్‌ను రాజ్యసభకు లేదా చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీకి పంపుతారని టాక్.
ఇక టీడీపీ నుంచి ఏకంగా ఇటు చంద్రబాబు కోడలు, అటు మంత్రి లోకేశే భార్యే రంగంలో ఉంటే టీడీపీ రాజకీయం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక వైసీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన వల్లభనేని బాలశౌరిని తప్పించేసిన జగన్ ఇప్పుడు అక్కడ ప్రముఖ విద్యాసంస్థల అధినేత విజ్ఞాన్ రత్తయ్య కుమారుడు శ్రీకృష్ణదేవరాయులను పోటీ చేయిస్తున్నారు. ప్రస్తుతం గుంటూరు లోక్‌సభ సీటుకు వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న దేవరాయులు వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ఇక జనసేన నుంచి ప్రముఖ హీరో శివాజీ గుంటూరు లోక్‌సభ సీటుకు పోటీ చేస్తారన్నది లేటెస్ట్ అప్‌డేట్. శివాజీ ఇటీవల పవన్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు. పవన్ ఏపీకి ప్రత్యేక హోదా కోసం రోడ్లమీదకు వస్తే హోదా వస్తుందని శివాజీ అంటున్నాడు. ఈ క్రమంలోనే ఆయన ప్రత్యేక హోదా కోసం గుంటూరులో దీక్ష కూడా చేశారు. ఇవన్నీ శివాజీకి కాస్త క్రేజ్ తెచ్చిపెట్టాయి.
ఈ క్రమంలోనే శివాజీని పవన్‌కు దగ్గర చేసేందుకు ఓ మీడియాధినేత ట్రై చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. మరి శివాజీ పవన్‌కు దగ్గరై జనసేనలో చేరితే గుంటూరు సీటే కోరుకుంటారని కూడా వార్తలు వస్తున్నాయి. మరి టీడీపీ నుంచి నారా బ్రాహ్మణి, జనసేన నుంచి శివాజీ, వైసీపీ నుంచి శ్రీకృష్ణదేవరాయులు పోటీపడితే గుంటూరు రాజకీయం రాష్ట్రంలోనే సెగలు రేపుతుందనడంలో సందేహమే లేదు.