బాహుబలి ది-కన్‌క్లూజన్ ట్రైలర్ రిలీజ్ అయితే టాలీవుడ్ పాత రికార్డులు, తెలుగు సినిమాతో పాటు ఇండియన్ సినిమాకు సంబంధించి యూట్యూబ్‌లో ఉన్న రికార్డులు కొట్టుకుపోతాయని అందరూ అనుకున్నారు. ఊరించి..ఊరించి ఈ రోజు బాహుబలి 2 ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఉదయం అలా ట్రైలర్ రిలీజ్ అయ్యిందో లేదో యూట్యూబ్ షేక్ అయిపోయింది.
వాస్తవానికి ట్రైలర్‌ను ఉదయం ఏపీ, తెలంగాణలోని 300 థియేటర్లలో ప్రదర్శించారు. ఆన్లైన్లో సాయంత్రం రిలీజ్ చేయాలనుకున్నా ఉదయమే రిలీజ్ అయిపోయింది. ట్రైలర్ గంట గంటకు ఓ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతోంది. తక్కువ గంటల్లోనే బాహుబలి 2 ట్రైలర్ ఇండియన్ సినిమా హిస్టరీలో ఎవ్వరికి సాధ్యం కాని రికార్డులు క్రియేట్ చేసింది.
బాహుబలి 2 ట్రైలర్ దెబ్బకు యూట్యూబ్ అఫీషియల్ అక్కౌంట్ స్తంభించిందంటే ఈ ట్రైలర్ దెబ్బేంటో తెలుస్తోంది. యూట్యూబ్ అక్కౌంటే స్తంభించడంతో వ్యూస్ తక్కువుగా చూపిస్తోందట. ఇక సాయంత్రం 6 గంటలకు (ఈ ఆర్టికల్ రాసే టైంకు) 10 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. అలాగే 3.73 లక్షల లైక్స్ వచ్చాయి. ఓ ఇండియన్ సినిమాకు కొద్ది గంటల్లోనే ఈ స్థాయిలో వ్యూస్, లైక్స్ రావడం అరుదైన రికార్డుగా ఇండియన్ సినిమా హిస్టరీలో నిలిచిపోయింది.
ఇక ధర్మా ప్రొడక్షన్స్ రిలీజ్ చేసిన హిందీ వెర్షన్ ట్రైలర్‌కు 6 గంటల వరకు 5.3మిలియన్ వ్యూస్ రాగా, 1.57 లక్షల లైక్స్ వచ్చాయి. ఈ రెండు భాషల వ్యూసే ఏకంగా కోటి 15 మిలియన్ ఉన్నాయి. లైక్స్ 5 లక్షలుగా ఉన్నాయి. ఏదేమైనా 24 గంటల్లో బాహుబలి 2 ట్రైలర్ రికార్డులను రాసుకునేందుకు చాలా పేజీలు క్రియేట్ చేసుకోవాల్సిందే.