ఏపీలో ఐటీ డ‌వ‌ల‌ప్‌మెంట్ బాబుకు క‌త్తిమీద సామే

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఐటీకి బ్రాండ్ అంబాసిడ‌ర్ ఎవ‌రంటే అంద‌రూ ఖ‌చ్చితంగా చంద్ర‌బాబునాయుడి వైపే చూస్తారు. ఎందుకంటే భాగ్య‌న‌గ‌రానికి ఐటీ కంపెనీల‌ను తీసుకురావ‌డంలోను, హైద‌రాబాద్‌ను సైబ‌రాబాద్‌గా మార్చ‌డంలోను చంద్ర‌బాబునాయుడు చూపిన చొర‌వ,  చేసిన కృషి అంత త్వ‌ర‌గా ఎవ‌రూ మ‌ర‌చిపోలేరు. తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌స్తుతం ప్ర‌తి ప‌ల్లెనుంచీ ప‌దుల సంఖ్య‌లో ఐటీ నిపుణులు దేశ‌వ్యాప్తంగా ఆ మాట‌కొస్తే ప్ర‌పంచం న‌లుమూల‌లా ప‌ని చేస్తున్నారంటే అది ఖ‌చ్చితంగా చంద్ర‌బాబు చ‌ల‌వే.

అయితే, తెలంగాణ ఏర్ప‌డ్డ త‌రువాత ఏపీలో కేవ‌లం ఏవో కొన్ని వ్య‌వ‌సాయాధారిత ప‌రిశ్ర‌మ‌లు త‌ప్ప యువ‌త‌కు పెద్ద సంఖ్య‌లో ఇవ్వ‌గ‌ల రంగ‌మేదీ లేక‌పోవ‌డం పెద్ద మైన‌స్‌గా మారింది. అందుకే బాబు కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని ప‌రిశ్ర‌మ‌లు, పెట్టుబ‌డుల‌కోసం ప్ర‌పంచ దేశాల‌న్నీచుట్టివ‌స్తున్నారు. సీఎం అయ్యాక‌ త‌న‌ను చూసి.. ఏపీలో కూడా హైద‌రాబాద్ స్థాయిలోనే ఐటీ సంస్థ‌లు వ‌స్తాయ‌ని కూడా చంద్ర‌బాబు ఆశించారు! అయితే… ఐటీ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన‌ సంస్థ‌ల‌ను ఏపీకి ఆక‌ర్షించ‌డంలో  ప్ర‌స్తుత ప‌రిస్థితి అంత సానుకూలంగా ఏమీ క‌నిపించ‌డంలేదు. ఇందుకు ప్ర‌ధాన కార‌ణంగా మౌలిక వ‌స‌తుల కొర‌తేన‌న్న‌ది ఐటీ కంపెనీల యాజ‌మాన్యాలు చెపుతున్న మాట‌.

రాష్ట్రంలో  సంస్థ‌లు ఏర్పాటు చేసేందుకు కొన్ని ఐటీ కంపెనీలు ముందుకు వ‌స్తున్నా.. వాటికి కావాల్సిన సౌక‌ర్యాలు అక్క‌డి అధికార యంత్రాంగం క‌ల్పించ‌లేక  పోతోంద‌ట‌. ఇటీవ‌లి కాలంలో దాదాపు 30 వ‌ర‌కు ఐటీ కంపెనీలు త‌మ శాఖ‌ల్ని విజ‌య‌వాడ‌లో ఏర్పాటు చేసేందుకు ముందుకు వ‌చ్చాయి. మ‌రికొన్ని  సంస్థ‌లు కూడా ఏపీలో కాలు మోపాల‌ని ఆశిస్తున్నాయి.  ఇక్క‌డ ప్ర‌ధానంగా ఈ సంస్థ‌ల  అవ‌స‌రాల‌కు అనువుగా ఉండే భ‌వ‌నాలు ల‌భించ‌డం పెద్ద స‌మ‌స్య‌గా మారిపోయింద‌ట . ఆఫీస్ అవ‌స‌రాల‌కు ప‌నికొచ్చే భ‌వ‌నాలు విజ‌య‌వాడ‌లో ఎంత వెతికినా దొర‌క‌డం లేద‌ని ఓ ప్ర‌ముఖ సంస్థ‌కు చెందిన ప్ర‌తినిధి  స్వ‌యంగా మీడియా ద‌గ్గ‌ర వాపోయారు. ఏడాది కాలంగా ఆఫీస్ భ‌వ‌నాల కోసం ప్ర‌య‌త్నిస్తున్న కంపెనీలూ అనేకం ఉన్నాయ‌ని తెలుస్తోంది.

అమ‌రావ‌తి  రాజ‌ధానిగా మారిన త‌రువాత‌, విజ‌య‌వాడ‌లో పెద్ద ఎత్తున కొత్త నిర్మాణాలు మొద‌ల‌య్యాయి. అయితే ఇవన్నీ నివాసాల‌కు అనువుగా ఉండేలా నిర్మిత‌మ‌వుతున్నాయి త‌ప్ప, వ్యాపార సంస్థ‌ల‌కు, ముఖ్యంగా ఐటీ కంపెనీల అవ‌స‌రాల‌కు త‌గిన‌విధంగా ఉండే నిర్మాణాలు మాత్రం ఎవ‌రూ చేప‌ట్ట‌డంలేద‌ట‌.  ఒక‌వేళ ఈ భ‌వ‌నాల‌ను ఆఫీస్‌ల కోసం తీసుకున్నా కూడా భారీ ఎత్తున మార్పులు చేయాల్సి ఉంటుంద‌నీ, అద‌న‌పు ఖ‌ర్చు చాలా ఉంటుంద‌నీ ఐటీ కంపెనీలు భ‌య‌ప‌డుతున్నాయ‌ట‌.

కాస్త ఇంచుమించుగా  ఇదే ప‌రిస్థితి ఏపీలో పారిశ్రామిక ప‌ట్ట‌ణంగా పేరొందిన‌ విశాఖ‌పట్నంలో కూడా నెల‌కొని ఉందని ఐటీ నిపుణులు చెబుతున్నారు. ఇక్క‌డ‌కూడా కార్పొరేట్ ఆఫీస్ స్పేస్‌ల‌ను నిర్మించేందుకు నిర్మాణ‌దారులు ఏమాత్రం మొగ్గు చూప‌డం లేదు. ఎందుకంటే.. అలా నిర్మించినా… వాటికి డిమాండ్ లేక‌పోతే ఖాళీగా పెట్టుకోవాలేమో అనే భ‌యం వారిని వెంటాడుతోంద‌ట‌. ఈ నేప‌థ్యంలో సీఎం చంద్ర‌బాబు స్వ‌యంగా రంగంలోకి దిగి.. వ్యాపార సంస్థ‌లు, నిర్మాణ సంస్థ‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం కుదిర్చి, వారిలో న‌మ్మ‌కం క‌లిగిస్తే త‌ప్ప ఈ స‌మ‌స్య ప‌రిష్కారం అయ్యేలా లేదు. కేవ‌లం రాజ‌ధాని మీద‌నే కాకుంటే స‌ర్కారు ఈ విష‌యంపైన కూడా దృష్టి సారిస్తే ఏపీ అభివృద్ధి క‌ల‌లు సాకార‌మ‌వుతాయి.