ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేతో మాట్లాడొద్ద‌ని తీర్మానం

రాజ‌కీయాల్లో నేత‌లు  ప్ర‌జ‌ల‌కు హామీలివ్వ‌డం… వాటిలో కొన్నింటిని నెర‌వేర్చ‌లేక‌పోవ‌డం, దాంతో ప్ర‌జ‌లు త‌మ‌కు అవ‌కాశం దొరికిన‌ప్పుడు ఆ ప్ర‌జాప్ర‌తినిధుల్ని నిల‌దీయ‌డం స‌ర్వ‌సాధార‌ణంగా జ‌రిగేదే… అయితే తాము ఎన్నుకున్న‌  ఎమ్మెల్యే తోనే త‌మ‌లో ఎవ‌రూ మాట్లాడ‌కూడ‌ద‌ని, ఒక గ్రామంలోని ప్రజలంతా కలిసి గ‌ట్టిగా తీర్మానం చేసుకున్న విష‌యం తెలిస్తే  కాస్త వింత‌గానూ, విచిత్రంగానూ ఉంటుంది క‌దా..! నిజ‌మే..వినడానికి ఆశ్చర్యంగానూ , అక్క‌డి ప్ర‌జ‌ల చైత‌న్యం చూస్తే మ‌రో ప‌క్క‌ ఆనందంగానూ అనిపిస్తున్న సంఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో ఇటీవ‌ల‌ జరిగింది.

ప్ర‌జాస్వామ్యంలో…  ప్రజాసేవకులమని చెప్పుకుంటూ ఓట్ల‌డిగే రాజకీయ నాయకులు  ప్రజల కోరిక మేరకు పనిచేయకపోతే ప్రజల నుంచి నిర‌స‌న‌లు రావ‌డం స‌హ‌జ‌మే.. ఆ మాట‌కొస్తే వ‌ర్త‌మాన రాజ‌కీయాల పోక‌డ‌పైనా, నేత‌ల వ్య‌వ‌హార శైలిపైనా అసంతృప్తి వ్య‌క్తం చేసే  ప్ర‌జ‌ల సంఖ్య త‌క్కువేమీ కాదు.  అలాంటి నేత‌ల‌ను నడిరోడ్డుపై  ప్ర‌జ‌లు ప్రశ్నించే సమయం, అవ‌కాశం రావాలని ఎవ‌రైనా  కోరుకుంటారు. అయితే ఆర్మూరు గ్రామ ప్రజలు మాత్రం ప్రస్తుతానికి తమ ఎమ్మెల్యేతో మాట్లాడకూడదని తీర్మానం చేసుకుని వార్త‌ల్లో నిలిచారు.

ఇంత‌కీ విష‌య‌మేమిటంటే ఇటీవ‌ల తెలంగాణ ముఖ్య‌మంత్రి రాష్ట్రంలో కొత్త జిల్లాల‌ను, మండ‌లాల‌ను ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. నిజామాబాద్ జిల్లా లోని ఆర్మూరు కేంద్రంగా నూత‌న మండ‌లాన్ని ఏర్పాటు చేయాల‌ని ఆ గ్రామ‌వాసులు కాస్త గ‌ట్టిగానే కోరుకున్నారు. అయితే వారి ఆశ‌లు నెర‌వేర‌లేదు. దీంతో ఈ గ్రామ‌స్థుల ఆగ్ర‌హం ఎమ్మెల్యే పైకి మ‌ళ్లింది. ఎమ్మెల్యే నిర్లక్ష్యంతోనే ఆలూరు గ్రామం – మండలం కాలేకపోయిందని ఆరోపిస్తూ ఎమ్మెల్యేతో ఆ గ్రామంలోని ఏ ఒక్కరూ మాట్లాడకూడదని  గ్రామ‌స్థులంతా క‌లిసి తీర్మానం చేసేశారు.  ఆర్మూరు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డితో ఆలూరు గ్రామంలో ఎవరూ మాట్లాడొద్దని గ్రామాభివృద్ధి కమిటీ తీర్మానం చేసింది.

ప్రభుత్వం తొలుత‌ ప్రకటించిన ముసాయిదాలో ఆలూరు మండలం కేంద్రంగా ఉందని రాజకీయ కారణాల వల్ల సమీప గ్రామాల వారు తీర్మానాలు ఇవ్వలేదని సాకు చూపుతున్నార‌ని ఆర్మూరు వాసులు అంటున్నారు. అయితే పక్క నియోజకవర్గాల్లో మాత్రం తీర్మానాల్లో లేకున్నా మండలాలు ఇచ్చారని వారు గుర్తు చేస్తున్నారు. కేవ‌లం ప‌క్క గ్రామాలు తీర్మానాలు ఇవ్వలేదనే సాకు చూపించి తమకు అన్యాయం చేశారని వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా ఇదే స‌మ‌యంలో ఆర్మూరు ఎమ్మెల్యే విదేశాల‌కు వెళ్ల‌డం కూడా ఆర్మూరు వాసుల ఆగ్ర‌హానికి ఆజ్యం పోసింద‌నే చెప్పాలి. ఇంత కీలక సమయంలో ఎమ్మెల్యే విదేశాలకు వెళ్లడమేమిట‌ని,  ఈ తీవ్ర అన్యాయానికి ఎమ్మెల్యేనే  కారణమని ఆ గ్రామ ప్రజలు అంటున్నారు. అందుకే ఆయ‌న వైఖ‌రికి నిర‌స‌న‌గా ఎమ్మెల్యేతో ఎవ‌రూ మాట్లాడ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించేసుకున్నారు. మ‌రి ఎమ్మెల్యే వీరి ఆగ్ర‌హాన్ని ఏవిధంగా చ‌ల్లారుస్తారన్న‌ది ఆస‌క్తిక‌రంగానే ఉంది క‌దూ…!