ప్రత్యేక హోదా కథ ముగిసినట్టే నా?

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కథ ముగిసినట్లే భావించాలి. ద్రవ్యబిల్లు అనే సాకుతో రాజ్యసభలో ఈ బిల్లుపై ఓటింగ్‌ జరగకుండా చేయడంలో భారతీయ జనతా పార్టీ సఫలమయ్యాక, కాంగ్రెసు పార్టీ అయినా ఇంకొక పార్టీ అయినాసరే ఏ మార్గంలోనూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చే అవకాశం లేకుండాపోయింది.

మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ నుంచి ఈ విషయంలో భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతు లభిస్తోంది. ‘అంతకు మించి’ అంటూ అసలుదానికి పాతరేయడం ద్వారా టిడిపి, బిజెపి ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం చేస్తున్నాయనే విషయం ప్రస్ఫుటమవుతున్నప్పటికీ ప్రత్యేక హోదా డిమాండు అనాధలా మిగిలిపోతోంది. ఎందుకో ప్రత్యేక హోదా డిమాండు విషయంలో ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ కూడా మొక్కుబడి ఆందోళనలతోనే సరిపెడుతోంది. 2019 ఎన్నికల నాటికి తప్ప ఈలోగా ప్రత్యేక హోదా అంశం గురించి ఇంకెవరు గట్టిగా మాట్లాడే పరిస్థితులు కూడా కనిపించడంలేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

అయితే ఢిల్లీ స్థాయిలో కాంగ్రెసు పార్టీ కొంత పట్టుదల ప్రదర్శిస్తోంది. లోక్‌సభలో ఒత్తిడి తీసుకురావడం, రాజ్యసభలోనే మరో విధంగా ప్రత్యేక హోదా అంశం చర్చకు వచ్చేలా చేయడం సహా ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యమాన్ని ఉధృతం చేయడం వంటి మార్గాల్ని అన్వేషిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఏదేమైనప్పటికీ పెద్దల సభగా పేర్కొనబడే రాజ్యసభ ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చకపోవడం ప్రజాస్వామ్యానికే తీరని అవమానం.