ఆ కుర్చీ కోసమే కుట్రలు..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే 8 నెలలు గడిచిపోయాయి. ఇప్పటికీ కొన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు కొన్ని పోస్టులను భర్తీ చేయటం వల్ల పార్టీలో కొందరు నేతలు అసహనానికి గురయ్యారు. దీంతో చివరి విడతలో మాత్రం అలాంటి ఇబ్బందులు లేకుండా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, కార్యదర్శి నారా లోకేష్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు ఇస్తామన్నారు చంద్రబాబు. దీంతో ఎవరికి తోచిన విధంగా వారు అధినేత దృష్టిలో పడేందుకు నానాపాట్లు పడుతున్నారనేది వాస్తవం.

ప్రభుత్వంలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి కోసం పోటీ తీవ్రంగానే ఉంది. ఆ పదవి తమకే దక్కాలని చాలా మంది సీనియర్ నేతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో పదవిపైన గంపెడాశలు పెట్టుకున్న కొందరు మహిళా నేతలు.. పార్టీ కార్యాలయంలోని సిబ్బందితో కలిసి తమ ప్రత్యర్థులపై కుట్రలు చేస్తున్నారనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట.

టీడీపీలో దాదాపు 22 ఏళ్లు పైగా పనిచేస్తున్న ఆచంట సునీతను మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఎంపిక చేసినట్లు ఇప్పటికే పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే ఆ పదవి కోసం ఇప్పటికే సుమారు వందకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే తాజాగా తెలుగు మహిళా విభాగానికి చెందిన ఇద్దరు నేతలు అంతర్గతంగా ఫేక్ ప్రచారం చేస్తున్న విషయం పార్టీ పెద్దల దృష్టికి చేరింది. గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలకు చెందిన ఇద్దరు మహిళా నేతలు పార్టీ కేంద్ర కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగితో కలిసి పదవి కావాలంటే డబ్బులు ఇవ్వాలని.. మాట్లాడుతున్న ఆడియో ఇప్పుడు పార్టీ పెద్దల వరకు చేరింది.

అయితే ఇక్కడే అసలు విషయాన్ని మర్చిపోయారు. వాస్తవానికి దొంగ పని చేసినా దొరకకుండా చేయాలనేది పెద్దల మాట. నామినేటెడ్ పదవి కోసం మరీ చీప్ గా రూ.30 వేలు అడగటం ఏమిటి..? అనేది మొదటి పాయింట్. ఇంక రెండో విషయం.. తాను దూర కంత లేదు.. మేడలో డోలు.. అనే సామెత మాదిరిగా.. ఆమెకే ఇంకా పదవి రాలేదు.. మరొకరికి ఎలా ఇప్పించగలరు అనే పాయింట్ మర్చిపోయారు. అంతా లాబీయింగ్ చేసే అవకాశం ఉంటే.. ఫస్ట్ లిస్ట్ లోనే పదవి వచ్చేది కదా అంటున్నారు పార్టీ అగ్రనేతలు.

అయితే మొత్తానికి ఈ పదవుల ఆడియో మాత్రం ప్రస్తుతం పార్టీలో బాగా వైరల్ అవుతోంది. దీని వెనుక ఎవరున్నారనే విషయంపై ఇప్పటికే పార్టీ పెద్దలు అంతర్గత విచారణ జరిపిస్తున్నట్లు తెలుస్తోంది. పదవుల కోసం కష్టపడి పనిచేయాలి తప్ప.. ఇలా కుయుక్తులు చేస్తే రావంటున్నారు కొందరు నేతలు. త్వరలోనే ఆ ఇద్దరు మహిళా నేతలతో పాటు సహకరించిన ఉద్యోగిపై కూడా క్రమశిక్షణ చర్యలు ఉంటాయంటున్నారు.