మేము సైతం… మీ కోసం…!

బుడమేరు… చిన్నదే… కానీ చేసిన నష్టం మాత్రం మాటల్లో చెప్పలేనంత. ప్రభుత్వం అధికారికంగా రూ.6,880 కోట్లు అని లెక్క తేల్చింది. ఇదంతా రహదారులు, ప్రభుత్వ ఆస్తులు, ప్రజల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు, వరద సాయం, పంట నష్టం.. అని లెక్క తేల్చింది. అయితే వాస్తవ పరిస్థితులు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయి. వేలాది కుటుంబాలు వరద బారిన పడ్డాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. రూపాయి రూపాయి పోగేసి కట్టుకున్న ఇల్లు నీటి ముంపునకు గురైంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువులు వరదలో కొట్టుకుపోయాయి. చివరికి కట్టుబట్టలతో మేడలపైకి చేరుకున్నారు. గుక్కెడు నీటి కోసం ఆశగా ఎదురుచూశారు. పిడికెడు మెతుకుల కోసం పరుగులు తీశారు. ఎన్‌డీఆర్ఎఫ్ బృందాల సాయంతో పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. చివరికి ఐదు రోజుల తర్వాత వరద నీరు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో పరిస్థితులు చూసి కన్నీటిపర్యంతం అవుతున్నారు. బురద నీరు చేరిన ఇళ్లు… పాచిపట్టిన గోడలు… చీకిపోయిన బట్టలు… పాడైన వస్తువులు… నీటి పాలైన తిండి గింజలు… దాదాపు ప్రతి ఇంట్లో ఇదే పరిస్థితి. కట్టుబట్టలతో నడిరోడ్డుపై నాలుగు రోడ్ల కూడలిలో నిల్చుని… ఎటు వైపు వెళ్లాలా అనే విషయం అర్థకాక అలో లక్ష్మణా అంటున్నారు.

ఇలాంటి వారికి మేమున్నాం అంటూ ఆపన్న హస్తం అందించేందుకు మనసున్న మారాజులు ముందుకు వస్తున్నారు. బాధితులను ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చారు. సినిమా నటులు, కార్పొరేట్ సంస్థల దిగ్గజాలు, బడా వ్యాపారస్తులు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు… ఇలా ఎవరికి తోచినంత వారు ఆర్థిక సాయం అందించారు. వీరితో పాటు కొందరు సామాన్యులు కూడా మేము సైతం… మీ కోసం అంటూ ముందుకు వస్తున్నారు. వరదల్లో పూర్తిగా నష్టపోయిన వారికి ఉడతా భక్తితో సాయం అందిస్తున్నారు.

ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ సంస్థ వరదలో పాడైన తమ సంస్థ ఉత్పత్తులను పూర్తి ఉచితంగా సర్వీస్ చేస్తామని ప్రకటించింది. అలాగే ఏదైనా స్పేర్ పార్టులు అవసరమైతే సగం ధర చెల్లిస్తే చాలని చెప్పింది. ఇక విధ్యాధరపురం ప్రాంతానికి చెందిన ఓ సామాన్య స్టౌ మెకానిక్.. గ్యాస్ స్టవ్‌లను ఉచితంగా చేస్తామని ప్రకటించాడు. అలాగే ల్యాప్ టాప్‌, కంప్యూటర్లను ఫ్రీగా సర్వీసింగ్ చేస్తానని ఓ యువకుడు హామీ ఇచ్చాడు. కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు సైతం ముందుకు వస్తున్నాయి.

ఏపీ తెలుగు మహిళ రాష్ట్ర కమిటీ సభ్యులు ఐదు రోజులుగా వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తోంది. ఓ ట్రాక్టర్‌లో ఆహార పదార్ధాలు, మంచినీళ్లు తీసుకుని రోజుకో కాలనీలో పర్యటిస్తున్నారు. బాధితులను ట్రాక్టర్ ద్వారా పునరావాస కేంద్రాలకు తరలించారు. పది మంది మహిళలు… తాము దాచుకున్న సొమ్ముకు తోడు.. దాతల సాయంతో.. చీరలు, దుప్పట్లు అందిస్తున్నారు. ఇప్పటికే సుమారు రూ.10 లక్షల విలువైన సామాన్లను అందించారు. కొన్ని ప్రాంతాల్లో నీటి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పటికీ పోలీసుల సాయంతో… శివారు ప్రాంతాలకు వెళ్లి సాయం అందిస్తున్నారు. ఇప్పుడు వీరి ఆదర్శంతో అనంతపురం, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన మహిళా నేతలు కూడా తమ వంతు సాయం అందించేందుకు సిద్ధమవుతున్నారు.