ఏపీలో నామినేటెడ్ పదవులపై ఫుల్ క్లారిటీ…!

ఏపీలో నామినేటెడ్ పదవుల కోలాహలం తారాస్థాయికి చేరుకుంది. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా నిండకముందే… పదవుల కోసం నేతలంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ముందుగా పదవుల కేటాయింపులో కూడా ఈసారి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే ఎవరెవరికి ఏ పదవి ఇవ్వాలనే విషయంపై ఇప్పటికే ఓ అవగాహన వచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి గతంలో పదవుల కేటాయింపు విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలపై పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత పార్టీలో చేరిన జూపూడి ప్రభాకర్, కారెం శివాజీ వంటి నేతలతో పాటు అప్పటి వరకు కాంగ్రెస్‌లో పదవులు అనుభవించి… చివరి నిమిషంలో వచ్చిన వారికే మంత్రి పదవులు కేటాయించారు చంద్రబాబు. దీంతో తొలి నుంచి పార్టీలో కొనసాగుతున్న నేతలంతా కొంత అసహనం వ్యక్తం చేశారు. అయితే ఈసారి మాత్రం అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా చంద్రబాబు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

గతంలో మొహమాటంతో కొందరికి పదవులిచ్చిన చంద్రబాబు… ఈసారి మాత్రం పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి… టికెట్లు వదులుకున్న వారికి మాత్రమే నామినేటెడ్ పదవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని ఇప్పటికే పొలిట్‌బ్యూరో సమావేశంలో కూడా తేల్చేశారు. అయితే ఎవరెవరికి పదవులనే విషయం మాత్రం మీటింగ్‌లో వెల్లడించలేదు. అయితే ఎవరికి ఏ పదవి అనే విషయం ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ జాబితా కూడా సిద్ధం చేసినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

ముందుగా కీలకమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుతో పాటు మరో 14 ప్రధానమైన కార్పొరేషన్‌‌‌లకు ఛైర్మన్ల పదవులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే కూటమి భాగస్వామ్య పార్టీలు జనసేన, బీజేపీలతో సంప్రదింపులు పూర్తి చేశారు. ఆయా పార్టీల నుంచి ఎవరికి పదవులివ్వాలనే విషయం కూడా క్లారిటీకి వచ్చారు. టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా ఓ మీడియా ఛానల్ అధిపతి పేరు ప్రచారంలో ఉంది. అయితే దీనికోసం ఎమ్మెల్యేలు రఘురామ కృష్ణంరాజు, కళా వెంకట్రావు పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బోర్డు సభ్యులుగా తెలంగాణ నుంచి నర్సిరెడ్డి, ప్రొఫెసర్ తిరునగరి జ్యోత్స్న పేర్లు ఖరారు చేశారు. ఏపీ నుంచి నెల్లూరు జిల్లా కొవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో పాటు దినేష్ రెడ్డిలో ఒకరికి ఖాయం. అలాగే ఉత్తరాంధ్ర నుంచి కూన రవికుమార్‌ పేరు వినిపిస్తోంది. వీరితో పాటు జనసేన పార్టీ తరఫున బొలిశెట్టి శ్రీనివాస్‌కు పదవి ఖాయమంటున్నారు పార్టీ నేతలు.

ఇక కీలకమైన ఏపీఐఐసీ, ఆర్టీసీ, పౌరసరఫరాల శాఖ, మహిళా కమిషన్, ఎస్సీ కమిషన్‌లకు కూడా ఛైర్మన్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు హామీ మేరకు ప్రొద్దుటూరు టికెట్ త్యాగం చేసిన డా.ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఏపీఐఐసీ, మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఆర్టీసీ, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభికి పౌరసరఫరాల శాఖ ఇవ్వనున్నట్లు సమాచారం. ఎస్సీ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి పీతల సుజాత, మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా ఆచంట సునీత, పార్టీ తెలుగు మహిళ అధ్యక్షురాలిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ పేర్లను ఖరారు చేసినట్లు పార్టీ నేతలు వెల్లడించారు. వీటితో పాటు ఎస్టీ కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి కిడారి శ్రావణ్ పేరు వినిపిస్తోంది. వీటితో పాటు అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పదవిని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు ఇవ్వనున్నట్లు పార్టీ అగ్రనేతలు వెల్లడించారు.