మీలో ఈ ల‌క్ష‌ణాలు కనిపిస్తున్నాయా.. అయితే ఐరన్ లోపం ఉన్నట్టే.. తప్పక తెలుసుకోండి..?!

మన శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన పోషకాల్లో ఐరన్ మొదటిది. శరీరాభివృద్ధి మరియు ఆరోగ్యంలో ఐరన్ కీలక పాత్ర వహిస్తోంది. ఇటీవల కాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఐరన్ లోపంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మన దేశంలో ఆడవారికి ఇది ఎక్కువగా కనిపిస్తుంది. మహిళల్లో 50% కంటే ఎక్కువ మంది ఐరన్ లోపంతో ఇబ్బందులు పడుతున్నారని.. సర్వేలు చెప్తున్నాయి. ఐరన్ కొరత కారణంగా రక్తహీనత మరియు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ క్రమంలో ఐరన్ లోపాన్ని ఈ లక్షణాల ద్వారా గుర్తించవచ్చు అని నిపుణులు చెప్తున్నారు.

ఐరన్ లోపం ఉన్న వారిలో ప్రధాన లక్షణం నీరసం. చిన్న చిన్న పనులకే చాలా అలసిపోవడం.. ఏ పని పూర్తిగా చేయలేకపోవడం జరుగుతూ ఉంటాయి. చేసే పనిపై ఏకాగ్రత కోల్పోవడం.. ఐరన్ లోపం వల్లే జరుగుతుంది. కారణం లేకుండా చిరాకు పడుతూ ఉండడం.. అలాగే తరచు నిద్రపోవాలని అనిపించడం.. ఐరన్ లోపం లో ఉండే లక్షణాలు. జుట్టూ కూడా విపరీతంగా రాలడం.. శరీరం పాలిపోవడం కూడా ఐరన్ లోపమే. శరీరంలో ఐరన్ లోపం తలెత్తినప్పుడు తరచు తలనొప్పి, ఐరన్ కంటెంట్ తగ్గడంతో మెదడుకు ఆక్సిజన్ అంద‌క‌ తల తిరగడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలోనే రక్తపోటు తగ్గడం జరుగుతూ ఉంటుంది.

కనురెప్పల లోపలి భాగం మరియు చిగుళ్ళు తెల్లగా మారిన ఐరన్ లోపం ఉన్నట్లే అని నిపుణులు చెప్తున్నారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు.. చిన్నపాటి పనులకే ఛాతిలో నొప్పి లాంటి సమస్యలు ఐరన్ లోపంతోనే కనిపిస్తాయి. గుండె కొట్టుకునే తీరులో కూడా మార్పులు వస్తాయని తెలుస్తోంది. ఐరన్ కొరత ఉన్నప్పుడు శరీరానికి సరిపడా ఆక్సిజన్ అందక గుండె పనితీరు మారుతుంది. గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ఇలాంటి సమస్యలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని.. ఇంట్లోనే ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారాలను డైట్ లో చేర్చుకోవడం వల్ల వీటికి చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.