కేసీఆర్ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా….!

సిద్దిపేట జిల్లాలో ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు కొనాయిపల్లి వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా.., దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాయి.

సిద్దిపేట జిల్లాలో ప్రధాన పార్టీలన్నీ దూకుడు పెంచాయి. సీఎం కేసీఆర్ కొనాయిపల్లిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొనాయిపల్లిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం కేసీఆర్ సెంటిమెంట్ ఆలయం. ఏ ముఖ్యమైన కార్యం తలపెట్టినా ఇక్కడి ఆలయంలోనే పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా స్వామి వారి సన్నిధిలోనే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి నామినేషన్ వేస్తారు. ఈ సారి కూడా అదే సెంటిమెంట్‌ను సీఎం కేసీఆర్ ఫాలో అవుతున్నారు. కేసీఆర్ వెంట మంత్రి హరీశ్ రావు, పలువురు బీఆర్ఎస్‌ నేతలు ఉన్నారు.

1985 నుంచి ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ శ్రీ వెంకటేశ్వరస్వామికి పూజలు చేసిన వెంటనే.. నేరుగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసేవారు. ఈ సారి మాత్రం.. పూజలు, నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేసినా దాదాపు ఐదు రోజుల అనంతరం 9వ తేదీ గురువారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అలాగే ప్రతిసారి కూడా పూజల అనంతరం గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడే కేసీఆర్.. ఈసారి అందుకు విరుద్ధంగా అక్కడ ఏం మాట్లాడకుండానే తిరిగి వెళ్ళిపోయారు. ఈ నెల 9న ముఖ్యమంత్రి కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రం నుంచి గజ్వేల్‌కు వెళ్లి నామినేషన్ వేస్తారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కామారెడ్డి వెళ్లి అక్కడ ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసగించనున్నారు.

ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న సందర్భంగా అభ్యర్థులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలలో నిమగ్నమవుతున్నారు. దుబ్బాక బీఎస్సీ అభ్యర్థి సల్కం మల్లేశం రేకులకుంట మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి కూడవెల్లి రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు తరపున బిజెపి శ్రేణులు మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థి గొంది భుజంగం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ మొదటి రోజు ఎలాంటి నామినేషన్లు దాఖలు కానప్పటికి.. రెండో రోజు దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు నామినేషన్లు దాఖలు అయ్యాయి.

ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుముకుంటా నర్సారెడ్డి తన కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరిస్తూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు జరిగే మేలు గురించి వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సారెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే అధికార బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. FDC చైర్మన్ ప్రతాప్ రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ మహిళలను ఉత్తేజపరిచే విధంగా వారితో కలిసి బతుకమ్మ అడటం, పాటలు పాడటం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు.

హుస్నాబాద్‌లోనూ ప్రచారం హోరెత్తుతోంది. హుస్నాబాద్ మండలంలో మాజీ ఎంపీ, హుస్నాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ప్రచార నిర్వహించారు. పొన్నంకు గ్రామ గ్రామాన యువతీ, యువకులు ఘన స్వాగతం పలికారు. కోలాటం, డప్పు చప్పుళ్ళ మధ్య పొన్నం ప్రజలతో కలిసి నృత్యం చేశారు. హుస్నాబాద్ పట్టణంలో కట్టేకోత మిషన్‌లో కట్టే కోస్తు ఎన్నికల ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టగానే నెరవేర్చబోయే హామీలను ప్రజలకు వివరించారు.