మాస్ మహారాజా అంటే అందరికీ గుర్తుకువచ్చే పేరు రవితేజనే. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి.. టాప్ స్టార్ గా ఎదిగిన అతి కొద్ది మంది హీరోల్లో రవితేజ ఒకరు. చిన్న చిన్న పాత్రలతో మొదలు పెట్టి.. హీరో అయ్యారు. అంచలంచలుగా ఎదుగుతూ భారీ స్టార్డమ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టేందుకు సిద్ధం అవుతున్నాడు.
రవితేజ కెరీర్ లో అత్యంత ప్రతిష్మాతకంగా రూపుదిద్దుకున్న చిత్రం `టైగర్ నాగేశ్వరరావు`. స్టూవర్టుపురంలో పేరు మోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. వంశీ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం అక్టోబర్ 20న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం రవితేజ ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.
తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో పాల్గొన్న డైరెక్టర్ హరీష్ శంకర్.. సినిమా టీమ్ కు బెస్ట్ విషెస్ తెలిపాడు. అలాగే రవితేజకు `మాస్ మహారాజా` అనే ట్యాగ్ ఎవరిచ్చారో కూడా రివీల్ చేశారు. నిజానికి ఇంతకు ఈ సీక్రెట్ ఫ్యాన్స్ కు తెలియదు. అయితే రవితేజకు ఆ ట్యాగ్ ఇచ్చింది మరెవరో కాదు హరీష్ శంకరే. హరీష్ శంకర్ ఫస్ట్ మూవీ `షాక్`. రవితేజ హీరోగా చేశారు. ఈ సినిమా ఫ్లాప్ అయింది. దాంతో హరీష్ శంకర్ కు ఏ హీరో అవకాశం ఇవ్వలేదు. అలా నల్లమలుపు బుజ్జిని కలిసినప్పుడు.. `లక్ష్యం` ఆడియో ఫంక్షన్ పనులు చూసుకోమని హరీష్ శంకర్ కు అప్పగించారు.
ఆయన ఆ రోజు సాయంత్రం అక్కడికి చేరుకుని అన్ని పనులు చూసుకున్నారు. ఈ క్రమంలోనే గెస్ట్ లుగా వచ్చిన హీరోలను వారి ట్యాగ్ తో స్టేజ్ పైకి పిలవాలని అనుకోవడం జరిగింది. అప్పుడే రవితేజను స్టేజ్ పైకి పిలిచేటప్పుడు .. ‘మాస్ మహారాజా’ రవితేజ అని పిలవండి అని హరీష్ శంకర్ హోస్ట్ అయిన సుమతో చెప్పారు. అలా రవితేజను `మాస్ మహారాజా` అని పిలవడం మొదలైంది. తాజాగా ఈ విషయాన్ని హరీష్ స్వయంగా బయపెట్టాడు. `ఇండస్ట్రీలో నాకంటూ ఒక పేరు, గుర్తింపు, లైఫ్ ఇచ్చిన రవితేజకి నేను ఒక చిన్న ట్యాగ్ ఇవ్వడం చాలా గర్వంగా ఫీలవుతున్నాను` అంటూ హరీష్ ఆనందం వ్యక్తం చేశాడు. కాగా, షాక్ తర్వాత హరీష్ శంకర్ చాలా ఏళ్లు ఖాళీగా ఉన్నాడు. దాంతో రవితేజానే మళ్లీ ఆయనకు ఛాన్స్ ఇచ్చాడు. అలా వీరిద్దరి కాంబోలో వచ్చిన మిరపకాయ్ సూపర్ హిట్ అయింది. హరీష్ శంకర్ ఆ తర్వాత వెనక్కి తిరిగిచూసుకోలేదు.