క‌ళ్లు చెదిరే ధ‌ర ప‌లికిన `లియో` డిజిట‌ల్ రైట్స్‌.. ఓటీటీ రిలీజ్ ఎప్పుడో తెలుసా?

కోలీవుడ్ స్టార్ ఇళ‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ తాజాగా `లియో` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఖైదీ, విక్ర‌మ్ సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ లియోకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యాన‌ర్ పై భారీ బ‌డ్జెట్ తో నిర్మిత‌మైన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా న‌టించింది. సంజయ్ దత్, అర్జున్ సర్జా, మడోన్నా సెబాస్టియన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

నేడు ఈ చిత్రం త‌మిళ్‌, తెలుగు భాష‌ల‌తో క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లోనూ గ్రాండ్ రిలీజ్ అయింది. యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన లియో చిత్రంలో విజయ్ యాక్టింగ్‌, యాక్షన్ సీన్స్ , క్లైమాక్స్ బాగున్నాయ‌ని చాలా మంది చెబుతున్నారు. ముఖ్యంగా యాక్ష‌న్ ప్రియులకు లియో బాగా న‌చ్చుతుందని అంటున్నారు.

ఇదిలా ఉంటే.. లియో ఓటీటీ రిలీజ్ కు సంబంధించి ఓ న్యూస్ నెట్టింట వైర‌ల్ గా మారింది. ప్ర‌ముఖ దిగ్గ‌జ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లియో మూవీ డిజిట‌ల్ రైట్స్ ను క‌ళ్లు చెదిరే ధ‌ర‌కు దక్కించుకుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ టైటిల్ కార్డులోనే వెల్లడించారు. పాన్ ఇండియా మూవీ కావ‌డంలో అన్ని భాష‌ల‌కు చెందిన డిజిట‌ల్ రేట్స్ ను ఏకంగా రూ. 120 కోట్లు ప‌లికాయ‌ట‌. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. అంటే న‌వంబ‌ర్ మొద‌టి వారం లియో ఓటీటీలో సంద‌డి చేసే అవ‌కాశం ఉంది.